రామ్ గోపాల్ వర్మ.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరిది. తెలుగు సినిమాను వేరే స్థాయికి తీసుకువెళ్లిన డైరెక్టర్. వర్మ తన మొదటి సినిమాను అక్కినేని నాగార్జున హీరోగా ‘శివ’ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కించారు. గొప్ప డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న వర్మ రానురాను సినిమాలపై కాకుండా వివాదాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాడు. ఆయన అవసరం లేని విషయాలను కూడా తన భుజాలపై వేసుకొని ఎప్పుడు వివాదాలలో ఉంటున్నాడు. ఆమధ్య శ్రీరెడ్డితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను తిట్టించడంతో ఆయన తెలుగు ఇండస్ట్రీలో బాగా చులకన అయ్యారు.
తాజాగా ఆయన బాలీవుడ్ పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. గత కొంత కాలంగా బాలీవుడ్ పై పలు రకాల విమర్శలు వెల్లువెత్తాయి. సుశాంత్ ఆత్మహత్య కేసు, డ్రగ్స్ కోణం, బయటకు రావడంతో బాలీవుడ్ పై విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉంటే జాతీయ మీడియా బాలీవుడ్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేసి విషం చిమ్ముతున్నాయంటూ బాలీవుడ్ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తించాయంటూ రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ మీడియా సంస్థలపై అగ్ర నిర్మాతలు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. బాలీవుడ్లోని నాలుగు అసోషియేషన్లు, 34నిర్మాణ సంస్థలు ఈ పిటిషన్ దాఖలు చేశాయి.
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి, రిపోర్టర్ ప్రదీప్ భండారి, టైమ్స్ నౌ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్, టైమ్స్ గ్రూప్ ఎడిటర్ నవికా కుమార్ పేర్లను పిటిషన్లో చేర్చారు. దీనిపై రామ్గోపాల్ వర్మ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. `బాలీవుడ్ స్పందన చాలా లేటైంది. బాలీవుడ్ ప్రముఖులంతా ఢిల్లీ హైకోర్టు ముందు స్కూలు పిల్లల్లా నిలబడి `టీచర్.. టీచర్.. అర్నబ్ మమ్మల్ని తిడుతున్నాడు’ అంటూ ఫిర్యాదు చేసినట్టుంది అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఇలా వెటకారంగా వర్మ ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ పై బాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్ చూడాల్సిందే మరి.