రాంగోపాల్ వర్మకు వరం అనుకోవాలో శాపం అనుకోవాలో తెలియదుగానీ ఆయన ప్రతి సినిమాకూ ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తోంది. ‘మర్డర్’ సినిమా ఆయనకు భలే మజా ఇచ్చేస్తోందనుకోవాలి. అమృత, ప్రణయ్ ల ప్రేమ కథతో ఆయన ‘మర్డర్’ సినిమాని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి అమృత కుటుంబికులు కోర్టుకెక్కారు. కోర్టులో విచారణ కూడా సాగింది. వాళ్ల పేర్లతో సినిమా లేకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నారు దర్శకనిర్మాతలు. తల్లిదండ్రుల మాట వినకుండా పెళ్లి చేసుకున్న ప్రేమికుల కథ ఇదని చెబుతా సినిమాని విడుదల చేస్తున్నారు.
విడుదల ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. దాంతో అమృత ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. దాంతో మళ్లీ ఈ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. సినిమా విడుదలను నిలిపివేసే వరకూ అమృత కుటుంబ సభ్యులు ఊరుకునేలా లేరు. హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ వేశారు. దీనికి ఆధారంగా వర్మ ఈ సినిమా ప్రివ్యూ షో వేశారని, తమ కథ ఆధారంగానే ఈ సినిమా తీశారని పేర్కొంటూ పిటిషన్ వేశారు. తమ కథనే సినిమాగా తీసి కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా పేర్కొన్నారు.
లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దాంతో నిర్మాతలు కొత్త ఉత్సాహంతో సినిమా విడుదలకు సిద్ధమయ్యారు. ‘మర్డర్’ సినిమా ఈ 24వ తేదీ విడుదలవుతోంది. అడ్వాన్సు బుకింగ్ లు కూడా మొదలయ్యాయి. ఇలాంటి కేసులు వర్మకు వరంగా మారుతున్నాయనడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. సినిమాలో దమ్ము ఉన్నా లేకపోయినా ఇలాంటి వార్తలతో ఆయన సినిమాలకు విపరీతమైన పబ్లిసిటీ మాత్రం వచ్చేస్తోంది.
Must Read ;-ఇంటర్ వ్యూలో వర్మ యాంకర్ ఆరాచకం.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!