ప్రకాశం జిల్లా మెట్టరైతుల వరప్రదాయినిగా భావిస్తున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2020 నవంబరులో నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో రూ.1401 కోట్లు కేటాయించారు. కేటాయింపులు చూస్తే ఘనంగానే ఉన్నాయి. అందులో పదిశాతం నిధులు కూడా నేటికీ విడుదల చేయలేదు. దీంతో పునరావాస కాలనీలు నిర్మించే కాంట్రాక్టర్లు అసలు పనులే ప్రారంభించలేదు. మొదటి సొరంగం పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి.
మాటలు కోటలు దాటుతున్నాయ్…
ప్రభుత్వ పెద్దలు చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయ్… చేతలు మాత్రం గడప దాటడం లేదని మరోసారి రుజువైంది. టీడీపీ హయాంలో శ్రీశైలం నుంచి వెలిగొండకు మొదలు పెట్టిన మొదటి సొరంగంలో 17కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో కిలోమీటరు సొరంగం పూర్తి చేస్తే వెలిగొండ ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. ఇక రెండో సొరంగం పనులు 11 కిలోమీటర్లు పూర్తి చేశారు. మరో ఏడు కిలోమీటర్ల సొరంగం తవ్వాల్సి ఉంది. అయితే ఏడాదిన్నరగా మొదటి సొరంగం పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో వెలిగొండ ప్రాజెక్టుకు ఈ ఏడాది నవంబరులో నీరు అందించలేమని ప్రకాశం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అంతా సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది ఆగస్టు నాటికి నీరు విడుదల చేస్తామని చెబుతున్నారు.
Must Read ;- “పోర్టు’’ నెల్లూరుకు కిరీటమైతే.. ప్రకాశానికి టోపీ నేనా..?
పునరావాసం అటకెక్కింది
వెలిగొండ ప్రాజెక్టు ముంపు కింద 11 గ్రామాలకు చెందిన 3,200 మందికి నివాస గృహాలను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాల్సి ఉంది. పునరావాసానికి ఒక్కో కుటుంబానికి 5 సెంట్ల భూమి, రూ.5.5 లక్షల వ్యయంతో ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. అయితే టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా వేధిస్తోందని, పాత బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వ పనులు చేయకూడదని ప్రకాశం జిల్లా కాంట్రాక్టర్లు సమావేశం నిర్వహించుకుని తీర్మానం చేసుకున్నారు. దీంతో పునరావాస పనులు అటకెక్కాయి.
మంత్రి పట్టించుకుంటేగా…
ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై అసలు దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆయన నియోజకవర్గం వెలిగొండకు 90 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో రైతులు కూడా ఎవరూ ప్రాజెక్టు గురించి మంత్రిని ప్రశ్నించడం లేదు. ఒంగోలు పరిసర ప్రాంతాల రైతులు నాగార్జునసాగర్ నీటితో నెట్టుకొస్తున్నారు. దీంతో వెలిగొండ పనులను మంత్రి పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అటు ప్రభుత్వం కూడా వెలిగొండను రాబోయే మూడున్నర ఏళ్లలో పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 2006లో ప్రారంభమైన వెలిగొండ ప్రాజెక్టు 2010 పూర్తి కావాల్సి ఉంది. 2020 వచ్చినా ఇంకా ప్రాజెక్టు పనుల్లో 70 శాతం కూడా పూర్తి కాలేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పిన నేతలు 17 సార్లు వాయిదా వేశారు. తాజాగా మరోసారి వాయిదా పడింది. అది కూడా చివరిది కాకపోవచ్చు. వెలిగొండకు నిధులు ఇవ్వకపోతే ఇంకెన్ని వాయిదాలు పడతాయో లెక్కించడం కష్టమే మరి.
Must Read ;- విసుగొచ్చింది : వాయిదాల కోసమే కేసు వాదిస్తున్నారా ?











