నిజజీవిత పాత్రల్ని తెరమీద ఆవిష్కరించడంలో మలయాళ మేకర్స్ తర్వాతే ఎవరైనా. సామాజిక సమస్యల్ని సందేశాత్మక రీతిలో ఆవిష్కరించడం వారికి మాత్రమే చెల్లింది. ఇప్పుడు మనం మాట్లాడుకొనే మలయాళ సినిమా పేరు ‘వెళ్ళం’ . నిజానికి మలయాళంలో ‘వెళ్ళం’ అంటే నీరు అని అర్ధం. కానీ ఇదో తాగుబోతు నిజజీవిత కథ. మన తెలుగువారు మద్యపానం సేవించడాన్ని మందుకొట్టడం అని ఎలా అర్ధం తీసుకుంటారో.. కేరళ ప్రజలు మద్యం సేవించడాన్ని ‘వెళ్ళమడిక్క’ అని మరో అర్ధం తీసుకుంటారు. ఇప్పుడు టైటిల్ లో ఉన్న ‘వెళ్ళం’ అనే పదానికి ఇక్కడ అదే అర్ధం.
ఒక తాగుబోతు కుటుంబ జీవనం అతడి తాగుడు వ్యసనం వల్ల ఎలా పతనం అయింది అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం. కన్నీరు కూడా నీరే కాబట్టి.. దర్శకుడు ఆ అర్ధం కూడా వచ్చేలా దీనికి ‘వెళ్ళం’ అనే పేరు పెట్టాడు. నిజానికి ఈ సినిమా మురళీ అనే ఒక వ్యక్తి నిజజీవిత కథ. అతడి పాత్రను అత్యంత సహజంగా పోషించి రక్తి కట్టించాడు మలయాళ హీరో జయసూర్య. తాగుడు మూలంగా అతడు కోల్పోయిన వ్యక్తిత్వం, మద్యం దొరకనప్పుడు అతడి రాక్షస ప్రవర్తన, ఆత్మ హత్యా ప్రయత్నం, దాని వల్ల అతడి భార్యా బిడ్డలు పడే ఆవేదన, దాన్ని మాన్పించడానికి ఆమె పడే తపన.. వీటిని ఎంతో సహజంగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రజీష్ సేన్.
లాక్ డౌన్ తర్వాత విడుదలైన మొట్టమొదటి మలయాళ సినిమా అయిన ‘వెళ్ళం’.. బ్లాక్ బస్టర్ హిట్టవ్వడమే కాకుండా.. ఎంతో మంది విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. గతంలో మలయాళంలో ఎన్నో సినిమాలు తాగుబోతుల మీద తెరకెక్కాయి. కానీ ఈ సినిమా మాత్రం .. అలవాటు వ్యసనంగా మారితే .. ఎంతమంది దాని వల్ల తీవ్ర వ్యధ అనుభవిస్తారో అనే పాయింట్ తో సందేశాత్మక రీతిలో ఆవిష్కరించాడు దర్శకుడు. మలయాళ హీరోలు .. కేవలం పాత్ర ను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి.. ఎంత పెద్ద హీరో అయినప్పటికీ.. జయసూర్య ఈ పాత్రను నామోషీ లేకుండా పోషించి శభాష్ అనిపించుకున్నాడు.
Must Read ;- మలయాళ సినిమాలో ఎంట్రీ ఇస్తోన్న స్టార్ యాంకర్