టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో వెంకటేశ్ స్టైలే వేరు. మిగతా హీరోల్లా .. కేవలం మాస్ యాక్షన్ మూవీస్ తోనే కాకుండా. .అద్భుతమైన కామెడీ టైమింగ్ తోనూ తన కెరీర్ ను బిల్డ్ చేసుకున్నాడు. ఓ రేంజ్ లో అభిమానుల్ని సంపాదించుకున్నాడు. వెంకీకి ఎక్కువగా విజయాల్సి అందించింది ఈ జోనరే. గత కొంతకాలంగా వెంకటేశ్ ఈ స్టైల్ లోనే సినిమాలు చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం నారప్ప అనే పక్కా మాస్ సినిమాను చేస్తున్న వెంకటేశ్ .. దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కామెడీ ఎంటర్ టైనర్ చేయబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
లాస్టియర్ అనిల్ రావిపూడి ఎఫ్ 2 తో తన కామెడీ టైమింగ్ తో బ్లాక్ బస్టర్ సాధించిన వెంకీ.. త్రివిక్రమ్ తో చేయబోతున్న సినిమాతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. త్రివిక్రమ్ అందుకు తగ్గ రీతిలోనే స్ర్కిప్ట్ సమకూర్చే పనిలో ఉన్నాడట. అసలు వెంకీలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ను వెలికితీసింది త్రివిక్రమే. తాను దర్శకుడు కాకపోయినా. ‘నువు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు’ లాంటి చిత్రాలకు రచన అందించాడు త్రివిక్రమ్. ఆ సినిమాల్లో పంచ్ డైలాగ్స్ , కామెడీ ఏ రేంజ్ లో పేలాయో తెలిసిందే. అది దృష్టిలో పెట్టకొనే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని వెంకటేశ్ భావించాడట. నిజానికి వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. అయితే ఇద్దరికీ అప్పట్లో పలు కమిట్ మెంట్స్ ఉండడంతో కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు ఇన్నాళ్ళకు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ నటించే సమయం ఆసన్నమైంది.
లెక్క ప్రకారం యన్టీఆర్ తో ఒక సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ కు .. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇంకా సెట్స్ మీదున్న కారణంగా.. తారక్ ఇప్పట్లో అందుబాటులో ఉండడు. అందుకే ఈ గ్యాప్ లో వెంకటేశ్ తో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడట త్రివిక్రమ్ . నారప్ప సినిమా పూర్తయిన వెంటనే వెంకీ.. త్రివిక్రమ్ సినిమాకి రెడీ అవుతాడట. అప్పుడు డైలాగ్ రైటర్ గా వెంకీ కామెడీ టైమింగ్ ను ఓ రేంజ్ లో సద్వినియోగం చేసుకున్న త్రివిక్రమ్ .. ఈ సారి దర్శకుడు గా దాన్ని ఏ రేంజ్ లో యుటిలైజ్ చేసుకుంటాడో చూడాలి.