కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ కబ్జాల వ్యవహారంతో పాటు సజ్జలపైనా భూ ఆక్రమణల ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు నేతలపైనా ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఐతే ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజిని వంతు వచ్చింది. రజిని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రజినితో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా సైతం చిక్కుల్లో పడ్డారు. వైసీపీ హయాంలో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి రూ.2 కోట్ల 20 లక్షల రూపాయలను అక్రమంగా వసూలు చేశారన్న అభియోగాలతో రజినితో పాటు జాషువాపై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. జాషువాపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా CS అనుమతి తీసుకుంది. ఇక విడదల రజినిపై విచారణకు అనుమతి కోసం గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే కేసు నమోదు చేయనున్నారు.
రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్
శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్ యజమానులను బెదిరించి, అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. రూ.5 కోట్లు డిమాండ్ చేసి.. రూ.2 కోట్ల 20 లక్షలు వసూలు చేశారని, అందులో విడదల రజినికి రూ.2 కోట్లు, ఐపీఎస్ అధికారి జాషువాకు రూ.10 లక్షలు, రజిని పీఏకు రూ.10 లక్షలు చెల్లించారని విజిలెన్స్ నిగ్గు తేల్చింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించగా..కేసు నమోదు కోసం అవసరమైన అనుమతులు ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారు.
రూ.50 కోట్ల జరిమానా చెల్లించాలంటూ!
2020 సెప్టెంబరు 4న విడదల రజిని(అప్పటికి మంత్రి కాలేదు) పీఏ రామకృష్ణ.. శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ దగ్గరకు వెళ్లి ఎమ్మెల్యే రజిని పిలుస్తున్నారని, వెంటనే రావాలని క్రషర్ యజమానులకు చెప్పారు. తర్వాత క్రషర్ యజమాని రజినీని కలవగా..క్రషర్ నడవాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తర్వాత కొన్నాళ్లకే నాటి గుంటూరు జిల్లా రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారిగా ఉన్న పల్లె జాషువా క్రషర్‌లో తనిఖీలు నిర్వహించారు. అనేక అవకతవకలు ఉన్నాయని, రూ.50 కోట్లు జరిమానా చెల్లించాలంటూ క్రషర్ యజమానులను బెదిరించారు.
కొన్నాళ్ల తర్వాత యజమానులకు ఫోన్ చేసిన జాషువా..ఎమ్మెల్యే విడదల రజిని చెప్పినట్లు చేస్తారా..లేదా రూ.50 కోట్ల జరిమానా విధించి, క్రషర్ సీజ్ చేయాలా అంటూ బెదిరించారు. తర్వాత క్రషర్ యజమానులను తన ఆఫీసుకు పిలిపించుకుని, త్వరగా సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారు. జాషువా నుంచి ఒత్తిడి పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్టోన్‌క్రషర్ యజమానులు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే క్రిమినల్ కేసులు పెడతామని, వ్యాపారం మూయించేస్తామని జాషువా బెదిరించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమేనని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రభుత్వానికి నివేదించింది. ఈ నివేదిక ఆధారంగానే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసింది.