యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మలయాళ బ్యూటీ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’.ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి అనేక వార్తలతో చర్చల్లో నిలుస్తూ వస్తోంది. మొన్న ఫస్ట్ మోషన్ పిక్చర్ విడుదల కానీ, నిన్నటికి నిన్న సినిమాలో సామ్ – విజయ్ ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు అని కానీ.. ప్రతీదీ సెన్సేషనల్ గా మారుతోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటపడింది.
షూటింగ్ లో విజయ్ దేవరకొండ, సమంత గాయపడ్డారనేది వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.అధికారిక ప్రకటన వెలువదనప్పటికీ ఫిల్మ్ సర్కిల్స్ సమాచారం మేరకు కశ్మీర్ లోని పహల్గామ్ ప్రాంతంలో చిత్రీకరించిన ఒక స్టంట్ సీన్ లో… లిడ్డర్ నదిపై తాడుతో నిర్మించిన వంతెనపై నుంచి వాహనాన్ని నడపాల్సి ఉందట.. ఆ సీన్ చేస్తున్నప్పుడు వాహనం నీటిలో పడటంతో ఇద్దరికీ గాయాలైనట్టు టాక్ వినిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరికీ చికిత్స అందించారని కొందరు చర్చించుకుంటున్నారు.
మరోవైపు కశ్మీర్ లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘ఖుషి’ టీమ్ హైదరాబాద్ కు పయనమైంది. జూన్ లో రెండో షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ మూవీకి ‘మజిలి’ ఫేమ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం దాదాపు 20 రోజుల పాటు కాశ్మీర్ లో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. ఇక సినిమాలో వెన్నెల కిశోర్, శరణ్య తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా. డిసెంబర్ 23 న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రొమాంటిక్ లవ్ స్టోరీ, థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.