తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అరెస్ట్ భయం పట్టుకుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అందుకే ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ నుంచి తన మకాం ఆంధ్రప్రదేశ్ కు మార్చేశారని పేర్కొన్నాారు. ఓటుకు నోటు కేసులో విచారణ ప్రారంభం అవ్వడంతో చంద్రబాబు దెబ్బకి అక్కడ నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం ఓటుకు నోటు కేసు రోజువారి విచారణ ప్రారంభించిన నేపథ్యంలో చంద్రబాబు తెలంగాణలో ఉంటే సేఫ్ కాదనే ఇక్కడికి వచ్చేశారని ట్విట్ చేశారు.
ఆ గొంతు నీదే..
తెలంగాణలోని అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక న్యాయస్థాన విభాగం ఓటుకు నోటు కేసులో రోజువారీ విచారణ చేపట్టింది. అందులో ‘మన వాళ్లు బ్రీఫ్ డ్ మీ’ అనే గొంతు చంద్రబాబుదేనని ఇప్పటికే ఫోరెన్సిక్ విభాగం వారు నిర్థారణ చేసినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నాారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు పక్కాగా వ్యతిరేక సాక్ష్యాలున్నాయని తెలిపారు. అరెెస్ట్ భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి కరకట్టకు వచ్చారంటూ ఎద్దేవా చేశారు..
‘వెయ్యి గొడ్లను పీక్కు తిన్న రాబందు ఒక్క గాలి వానకు కుప్పకూలిందన్న’ సామెత నీలాంటి వాళ్ల కోసమే పుట్టిందని సాయిరెడ్డి చంద్రబాబును ఎత్తిపొడిచారు. ఈ కేసు నుంచి నువ్వు తప్పించుకోలేక పోవచ్చని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అమరావతి రియల్ ఎస్టేట్ గురించి నువ్వు, నీ కొడుకు లోకేశ్ శోకాలు పెట్టడం తప్ప ఏ రోజైనా ప్రజల సమస్యల గురించి నోరు విప్పారా? అంటూ ప్రశ్నించారు. అమరావతి రైతులను రెచ్చగొట్టి నువ్వు , నీ కొడుకు సాధించింది ఏమి లేదంటూ వారి మీద ధ్వజమెత్తారు. రైతులను రెచ్చగొట్టడమే ప్రజాసేవగా భావిస్తున్నారంటూ విమర్శించారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటున్నారని అందుకోసమైనా ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలన్నారు.
అవి నిజమైన ఆధారాలేనా..?
ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ విభాగం దగ్గర రుజువులు ఉన్నట్లు విజయ సాయిరెడ్డి తెలిపారు. అయితే.. ఆ ఆధారాలు అన్నింటిని ఇప్పటి వరకు మీడియాకు ఎందుకు తెలపలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అన్ని రుజువులు మీ దగ్గర అంతా పక్కాగా ఉంటే ఇప్పటి వరకు వాటిని ఎందుకు బయట పెట్టలేదని పేర్కొన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఈ నోటుకు ఓటు కేసు మీకు ఎందుకు గుర్తుకు వస్తుందని అడుగుతున్నారు.