తమిళనాట విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చే కథానాయకులలో విజయ్ సేతుపతి ఒకరుగా కనిపిస్తాడు. విజయ్ సేతుపతి ఒక సినిమాను ఒప్పుకుంటే ఆ కథలో కొత్తదనం ఉంటుందనే నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది. ఆయన ఒక పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే, అది అప్పటివరకూ ఆయన చేయనిదై వుంటుందనే భావన వాళ్లకి కలుగుతోంది. అలా కొత్తదనం కోసం విజయ్ సేతుపతి నిరంతరం ప్రయత్నిస్తూనే వున్నాడు. వీలైనన్ని విజయాలను అందుకుంటూనే వున్నాడు. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఇమిడిపోవడం, సన్నివేశాలకి సహజత్వాన్ని ఆపాదించేలా ఆ పాత్రలో ఒదిగిపోవడం కారణంగానే కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దక్కింది.
తనని అభిమానులు ఒక స్టార్ హీరోగా చెప్పుకోవడం కన్నా, విలక్షణ నటుడిగా చెప్పుకోవడానికే విజయ్ సేతుపతి ఎక్కువగా ఇష్టపడతాడు. ఈ కారణంగానే పాత్రలో వైవిధ్యం వుంటే చాలు, నటించడానికి ఆయన సిద్ధమైపోతుంటాడు. అందువల్లనే ఆయన విలన్ పాత్రలకు .. కథలను మలుపుతిప్పే కీలకమైన పాత్రలను చేయడానికి .. అవసరమైతే గెస్టు పాత్రల్లో మెరవడానికి కూడా సిద్ధమవుతున్నాడు. ఒక వైపున హీరోగా దూసుకుపోతూ .. మరో వైపున విలన్ పాత్రలు చేయడానికి ఎంతో సాహసం కావాలి. సాధారణంగా విలన్ పాత్రలు చేస్తే హీరోగా అవకాశాలు తగ్గుతాయనే ఆలోచన చేస్తారు. ఇమేజ్ తగ్గుతుందని భయపడతారు. కానీ అలాంటి సందేహాలకు తావివ్వని సాహసిగా విజయ్ సేతుపతి కనిపిస్తాడు.
Must Read ;- ట్విట్టర్ స్టార్ గా మారిపోయిన సోనూ సూద్
విజయ్ సేతుపతి కేవలం తమిళ సినిమాల్లో అవకాశాలతో సరిపెట్ట్టుకోకుండా .. సంతృప్తి చెందకుండా, ఇతర భాషల్లోను నటించడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఆయన నటనలో నాణ్యతను గురించి తెలియడంతో ఇతర భాషల నుంచి కూడా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగు విషయానికి వస్తే, ‘సైరా’ తరువాత ఆయన ‘ఉప్పెన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో, విజయ్ సేతుపతి ‘రాయనం’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఆల్రెడీ ఆయన లుక్ కి మంచి మార్కులు పడిపోయాయి కూడా.
ఈ సినిమాలో ఆయన విరుగుడు లేని విలనిజాన్ని చూపించనున్నట్టు తెలుస్తోంది. ప్రతినాయకుడిగా తనకి ఎదురయ్యే సమస్యలను తనదైన స్టైల్లో ఆయన పరిష్కరించే తీరు, అందుకోసం ఆయన అవలంబించే పద్ధతి చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంటున్నారు. విలన్ గా ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు .. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా తరువాత తెలుగులోనూ విలన్ గా ఆయన బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తమిళంలో ‘మాస్టర్’ సినిమాలోను విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఈ సినిమా కూడా ఆయనలోని ప్రతినాయకుడిని అద్భుతంగా ఆవిష్కరిస్తుందని చెప్పుకుంటున్నారు. ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను విలన్ గా విజయ్ సేతుపతి ఏ స్థాయిలో అదరగొడతాడో చూడాలి మరి.
A lso Read ;- బాలయ్య సినిమాలో యువ ఎమ్మెల్యేగా నారా వారబ్బాయి?