Vijay Sethupathi :
సినిమా రంగంలో అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఎదిగిన చాలామంది జీవితం అలాంటిదే. బస్ కండక్టర్ గా చేసిన రజినీ కాంత్ సూపర్ స్టార్ అయ్యారు. మోటారు సైకిల్ మెకానిక్ గా జీవించిన అజిత్ స్టార్ డమ్ సంపాదించారు. ఇప్పుడు స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి జీవితం కూడా అలాంటిదే. సినిమాల్లోకి రాకముందు విజయ్ సేతుపతి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేసిన సంగతి ఎంతమందికి తెలుసు? చెన్నైలో ఓ కాలేజీలో చదువుకునేటప్పుడు డబ్బు కూడా కావాలి కాబట్టి ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనికి కుదిరారు.
కాలేజీ అయిపోయాక రూమ్ కి వచ్చి సాయంత్రం 7.30 గంటలకు ఫాస్ట్ ఫుడ్ డ్యూటీకి వెళ్లేవాడు. అర్ధరాత్రి 12.30 వరకూ అక్కడ పనిచేసి తిరిగి రూమ్ కి వచ్చేవాడట. ఆయన భోజనం కూడా అక్కడే. జీతం నెలకు రూ. 750. అలా కొంతకాలం గడిచాక టెలిఫోన్ బూత్ లోకి జీవితం మారింది. అక్కడ మూడు నెలలు పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాల వైపు దృష్టి మళ్లి జూనియర్ ఆర్టిస్టుగా రంగ ప్రవేశం జరిగింది. అలా జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఆయన ‘మాస్టర్ చెఫ్’ అనే టీవీ ప్రోగ్రామ్ హోస్ట్ గా బుల్లితెరపైకి రాబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ ట్రైలర్ ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితానుభవాలను ఆయన పంచుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఉల్లిపాయ సమోసా అంటే ఇష్టమని చెప్పారు. ప్రస్తుతం ఉల్లి సమోసా మార్కెట్లో దొరకడం లేదని, తాను మాత్రం ఇంట్లో సాయంత్ర పూట ఉల్లి సమోసా, కప్పు టీ తీసుకుంటానని వివరించారు.
Must Read ;- ఎన్టీఆర్ మూవీలో విజయ్ సేతుపతి











