ఏపీలో ఇటీవల కొందరు వైసీపీ నేతలు తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా విజయమ్మ అని చెబుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఆమె షర్మిలకు ఓటేయమని చేసిన వీడియో, ఇంకా వైసీపీపై, జగన్ పై ఆమె మౌనం అని విశ్లేషణ చేస్తున్నారు. నిజంగానే వైఎస్ జగన్ దారుణ పరాజయానికి తల్లి విజయమ్మ మద్దతు లేకపోవడం ఓ కారణంగా కూడా ఉంది. మరోవైపు షర్మిలపై జగన్ కూడా చాలా గుర్రుగా ఉన్నారు. తనను ముంచిన ప్రధానమైన వ్యక్తి చెల్లెలు షర్మిలే అని జగన్ భావిస్తు్న్నారట.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో ఘోర ఓటమి పాలైన వైసీపీని రాజకీయంగా ముందుకు నడిపించడానికి జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్టు ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాలలో కనిష్ట స్థాయిలో 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండడం.. జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో జగన్ తన పంథా మార్చినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పటికే జగన్ వచ్చే ఐదేళ్ల పాటు అసెంబ్లీలో అధికార కూటమి పార్టీలను ఎదుర్కోలేరు. కనుక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసి.. కడపలో వైఎస్ అవినాష్ తో రాజీనామా చేయించి.. అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ భావిస్తున్నారు. దీంతో అసెంబ్లీకి వెళ్లే బాధ తప్పడంతో పాటు.. ఎంపీగా ఢిల్లీలో రాజకీయాలు చేసుకోవచ్చని జగన్ అనుకుంటున్నారు.
అలాంటప్పుడు పులివెందుల నుంచి విజయమ్మని బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. అయితే, ఈ ప్రతిపాదన పెడితే షర్మిల ఊరుకుంటారా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇలాంటి సమయంలో విజయమ్మ కొడుకు జగన్ వైపు నిలుస్తారా లేక షర్మిలకు అండగా ఉంటారా అనేది కూడా ఆసక్తిగానే ఉంది. ఇలా తన కన్నబిడ్డల పంచాయితీతో నలిగిపోతున్న విజయమ్మ జగన్ ప్రతిపాదనకు అంత సులభంగా ఒప్పుకుంటారా అన్నది వేచి చూడాలి.
మరోవైపు, జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మకు దూరం కావడం కారణంగానే ఇంత భారీ నష్టం జరిగిందని ఇప్పటికే తేలిపోయింది. కాబట్టి, జగన్ రెడ్డి తన తల్లిని ఇంకా దూరం చేసుకుంటారని అనుకోలేం. దండోపాయం ద్వారా ఇంకా మునిగే అవకాశం ఉంది. ఇప్పటికే కుటుంబంలో గొడవల ద్వారా జగన్ చాలా నష్టపోయారు. అటు వైఎస్ షర్మిల తనతో రాజీకి వచ్చే అవకాశాలు అస్సలు ఉన్నట్లు కనిపించడం లేదు. కనీసం తల్లితో అయినా జగన్ రెడ్డి మంచి సంబంధాలు కొనసాగిస్తే మేలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.