అసలు మోగదే మోగదన్నాడు. మోగినా తాను ఒప్పుకోనన్నాడు. అసలు కుదరదన్నాడు. కాని ఇప్పుడు మాత్రం అది మోగి తీరుతుందన్నాడు. పైగా తమ బాస్ పర్మిషన్ ఇస్తే ఇప్పుడే మోగుద్దన్నాడు. ఆ మోత నచ్చకపోయినా నచ్చనోళ్లు భరించాల్సిందే అని చెప్పేశాడు. దాంతో అందరూ షాకయ్యారు. ఇదేంటి విజయసాయిరెడ్డేనా.. గంటా వైసీపీలో చేరతాడని చెబుతాడేంటి.. మొన్నటి వరకు అడ్డం పడింది ఈ క్యాండేటే కదా అని ఆశ్చర్యపోయారు. ఈయనా, మంత్రి అవంతి కలిసి గంటాను ఆపటానికి అవసరమైన పనులన్నీ చేశారు. దాదాపు ఆపేశారు కూడా. మరిప్పుడు ఇదేంటా అని పొలిటికలర్ సర్కిల్స్ లెక్కలేయడం మొదలెట్టాయి.
ఇటు చూస్తే గంటా కూడా..
ఇటు చూస్తే గంటా కూడా విజయసాయిరెడ్డి ఎందుకలా అంటున్నాడో తనకు తెలియదంటున్నాడు అమాయకుడిలాగా. మొన్నటి వరకు అలిసిపోయేంతగా ట్రయల్స్ వేసి వేసి.. ఇక లాభం లేదని నిద్రపోయాడు. సడెన్‌గా స్టీల్ ప్లాంట్ ఇష్యూ రాగానే.. తెలివైన రాజకీయవేత్త కాబట్టి.. వెంటనే యాక్టివ్ అయిపోయాడు. ఉద్యమం అంటూ కొత్త లెక్కలు మొదలెట్టాడు. అప్పటివరకు టీడీపీ వాళ్లను పట్టించుకోని గంటా శ్రీనివాసరావు.. నిరాహారీ దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్‌ను పరామర్శించాడు, మద్దతు ప్రకటించాడు. చంద్రబాబు పర్యటనలో కూడా పాల్గొన్నాడు. కాని మొన్న మళ్లీ చంద్రబాబును తిరుపతి ఎయిర్ పోర్టులో అన్ని గంటల సేపు నిర్బంధిస్తే ఒక్క ప్రకటన కూడా చేయలేదు.. ఖండిస్తూ. దాంతో మళ్లీ అనుమానాలొచ్చేశాయ్.
Also Read ;- పాతికేళ్లు పాలకవర్గం,15 ఏళ్ళు అధికారులు.. సకాలంలో జరగని జీవీఎంసీ ఎన్నికలు
ఫుల్లు డిఫెన్స్‌లో వైసీపీ
ఇప్పుడు విశాఖలో నడుస్తున్న టాక్ ఏంటంటే.. విశాఖ స్టీల్ వ్యవహారంతో మూడు రాజధానుల ముచ్చట వెనక్కి పోయి.. వైసీపీ ఫుల్లు డిఫెన్స్‌లో పడిపోయింది. ఎంతలా అంటే విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసే వ్యవహారం చేస్తూనే.. విశాఖలో పాదయాత్ర డ్రామా చేయాల్సి వచ్చింది. అయినా లాభం లేకుండా పోయింది. పైగా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు నెత్తి మీదికొచ్చి కూచున్నాయి. ఎలా చేయాలా అని ఆలోచించి.. అంతకు ముందు తమ తలుపులు కొట్టి కొట్టి అలిసిపోయి పక్కకు పోయిన గంటా గుర్తొచ్చాడు. ఇప్పుడు గంటాను దువ్వి దగ్గరకు తీసుకుంటే.. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపించగలం లేదంటే కష్టం. కాని నెగెటివ్ ఫలితాలొస్తే మాత్రం ఆ దెబ్బ మామూలుగా ఉండదు. మూడు రాజధానుల ముచ్చటకే బ్రేక్ వేయాల్సిన పరిస్ధితి వస్తుంది. అందుకే నచ్చినా.. నచ్చకపోయినా అవంతిని సర్దుకోమని.. గంటాను లైన్లో పెట్టే పనిలో పడ్డారని తెలుస్తోంది.
టీడీపీతో ఉండటమే బెటరేమో..
అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ వ్యవహారంతో వైసీపీపై వ్యతిరేకత వస్తుండటం.. బీజేపీ సంగతి సరేసరి.. అందుకే టీడీపీతో ఉండటమే బెటరేమో అనే ఆలోచనలో గంటా పడ్డారు. అందుకే ఎటూ తేల్చుకోలేక డైలమాలో పడ్డట్టు సమాచారం. మొత్తం మీద స్టీల్ ప్లాంట్ వ్యవహారం విశాఖ రాజకీయ లెక్కలను మార్చేసింది. పైగా మున్సిపల్ ఎన్నికలు కూడా రావటంతో.. ఇక రాజకీయ నేతలు పిల్లిమొగ్గలేస్తూ.. గెలుపు కోసం నానా పాట్లు పడుతున్నారు. ఆ పాట్లలో ఒక పాటు ఈ గంటా ఎపిసోడ్.
Must Read ;- ప్రశాంత విశాఖలో వైసీపీ చిచ్చు. ఓటుతో బుద్ధిచెప్పాలన్న లోకేష్