లేడీ సూపర్ స్టార్ గా టాలీవుడ్ ను ఏలిన కథానాయిక విజయశాంతి.. కెరీర్ బెస్ట్ మూవీ ‘ప్రతిఘటన’. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై టి.కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1985, అక్టోబర్ 11న విడుదలైంది. సరిగ్గా నేటికి 35 ఏళ్ళు పూర్తిచేసుకుంది . ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. చంద్రమోహన్, రాజశేఖర్, సుత్తివేలు, వై.విజయ, రాళ్ళపల్లి, కోట శ్రీనివాసరావు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈసినిమాతో.. కన్నడ నటుడు చరణ్ రాజ్ విలన్ గా పరిచయం అయ్యాడు. చక్రవర్తి సంగీత సారధ్యంలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా వేటూరి రాసిన ఈ దుర్యోధన దుశ్శాశన దుర్వినీత లోకంలో పాట ఆయనికి ఉత్తమ గీత రచయిత అవార్డు ను తెచ్చిపెట్టింది. ఇంకా ఇందులో సుత్తివేలు పోషించిన కానిస్టేబుల్ శ్రీశైలం పాత్ర ఆయన కెరీర్ ను మంచి మలుపు తిప్పింది.
కాళి అనే గుండా, మంత్రి కాశయ్య కలిసి అందరిపై అరాచకాలు చేస్తూంటాడు. ఝన్సీ అనే లెక్చరర్, సత్యమూర్తి అనే లాయర్ ఇద్దరూ భార్యా భర్తలు. సత్యమూర్తి భయస్తుడు. ఝాన్సీ ధైర్యవంతురాలు. ఎస్సై ప్రకాష్ కాళిని అరెస్ట్ చేస్తాడు. కాళి, ప్రకాష్ ని నడి రోడ్డు పై హత్య చేసాడు. ఈ దారుణం చూసిన ఝాన్సీ, కాళిపై పొలీసుకేసు పెడుతుంది. భర్త, అత్తమామలు ఈ విషయంలో ఆమెను తప్పు పడతారు. పగబట్టిన కాళి, నడివీదిలో ఝాన్సీని వివస్త్రను చేస్తాడు. కాళి వల్ల అన్యాయానికి గురి అయిన ఝాన్సీకి, నాగమ్మ ఇంటిలో ఆశ్రయం దొరుకుతుంది. ఝాన్సీ పనిచేసే కాలేజిలో చదువు కోసం వచ్చే విద్యార్థుల్లో రౌడీలే ఎక్కువుంటారు. ఝాన్సీ వారిని అందరిని మారుస్తుంది. కాళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎన్నికల ప్రచారంలో కాళి తరుపున ప్రచారం చేస్తానని ఝాన్సీ ముందుకు వస్తుంది. మొదట అనుమానించినా, తరువాత నమ్మతాడు కాళి. నాగమ్మ, స్టూడెంట్స్ అందరూ ఆమెను అపార్థం చేసుకుంటారు. కాళికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేసిన శ్రీరీశైలం ను కాళీ చంపేస్తాడు. రిగ్గింగ్ చేసీ, భయపెట్టి కాళి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుస్తాడు. విజయోత్సవ సభలో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాళిని, గొడ్డలితో నరికి చంపేస్తుంది ఝాన్సీ.
ఈ సినిమా క్లైమాక్స్ అప్పటి ప్రేక్షకుల్ని నిశ్చేష్టుల్ని చేసింది. అందుకే సినిమా సంచలన విజయం సాధించింది. నిజానికి ఈ క్లైమాక్స్ సీన్ ను బాలచందర్ తమిళ సినిమా ‘అచ్చమిల్లై అచ్చమిల్లై’(భయం లేదు భయం లేదు) నుంచి స్పూర్తిగా తీసుకున్నారు టి.కృష్ణ. అందులో సరిత కథానాయికగా నటించింది. ఇదే సినిమా అప్పట్లోనే ‘ఏ ఎండకా గొడుగు’ సినిమా గా విడుదలై.. ఇక్కడా విజయం సాధించింది.