టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్ట్ సందర్భంగా ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇప్పటికే హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టులో పడిన అక్షింతలను ఈజీగానే దులిపేసుకున్న ఏపీ పోలీసులు.. పట్టాభిని తమ కస్టడీకి అప్పగించాలంటూ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం నాడు విచారణ చేపట్టిన విజయవాడ కోర్టు ఏపీ పోలీసులకు షాకిస్తూ.. కస్టడీ పిటిషన్‌ను కొట్టిపారేసింది. పట్టాభిని కస్టడీకి అనుమతించేది లేదంటూ కోర్టు సదరు పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పట్టాభి అరెస్ట్ సందర్భంగా హైకోర్టులో అక్షింతలు తిన్న ఏపీ పోలీసులకు కస్టడీ పిటిషన్ తో విజయవాడ కోర్టులోనూ మొట్టికాయలు పడ్డట్టైంది.
హైకోర్టు అక్షింతలు మరిచారే
ఏపీలో డ్రగ్స్ దందా సాగుతోందని, దానిని అరికట్టాలంటూ టీడీపీ వరుసగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ దందాపై దృష్టి సారించాల్సిన ఏపీ పోలీసులు.. ఆ పనిని మానేసి డ్రగ్స్‌దందాపై ఆరోపణలు చేసిన టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకు అర్థరాత్రి పోలీసులు నోటీసులు జారీ చేసిన వైనంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పట్టాభి.. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ను అసభ్యపదజాలంతో పట్టాభి నిందించారన్న ఆరోపణలతో వైసీపీ శ్రేణులు టీడీపీ కేంద్ర కార్యాలయం, జిల్లాల కార్యాలయాలు, పట్టాభి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇళ్లపై దాడులు చేశాయి. ఓ రాజకీయ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసిన వైసీపీ శ్రేణులను వదిలేసి సీఎంను దూషించారంటూ పట్టాభిపై కేసు పెట్టిన పోలీసులు.. ఆయన ఇంటి తలుపులను బద్దలు కొట్టి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై పట్టాభి హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ సందర్భంగా సీఎంపై దుర్భాషలాడితే 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవడానికి బదులుగా నిందితుడిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ హైకోర్టు పోలీసుల తీరును తప్పుబట్టింది. అంతేకాకుండా ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తే.. అరెస్ట్ చేయాల్సిన అవసరమేముందని కూడా కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా పట్టాభిని విజయవాడలోని థర్డ్ క్లాస్‌మేజిస్ట్రేట్ కోర్టులో ఎలా హాజరుపరుస్తారని కూడా హైకోర్టు ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టింది.
కస్టడీ అవసరముందా?
పట్టాభి అరెస్ట్ సందర్భంగా పోలీసుల తీరును హైకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో.. సాధారణంగా ఏపీ పోలీసులు తమ వైఖరిని మార్చుకోవాల్సి ఉంది. ఈ కేసును అంతటితో వదిలేయాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా పట్టాభిని తమ కస్టడీకి అప్పగించాలంటూ విజయవాడ కోర్టు ఏపీ పోలీసులు పిటిషన్ వేయడం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయ కక్షపూరితంగా వ్యవహరిస్తూ జగన్ సర్కారు పెద్దలు చెప్పినట్టుగా పట్టాభిని మరింతగా ఇబ్బంది పెట్టేందుకే పోలీసులు యత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ యత్నాలను ఇప్పటికే హైకోర్టు తప్పుబట్టగా.. ఇప్పుడు విజయవాడ కోర్టు కూడా తప్పుబడుతున్నట్లుగానే పట్టాభి కస్టడీ పిటిషన్‌ను కొట్టేయడంతో పోలీసులకు చెక్ పడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా 41ఏ సెక్షన్ కింద నమోదు చేసిన కేసులో పట్టాభిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సీఎంను దూషించారంటూ ఏకంగా కోర్టులోనే వీడియోలు ప్లే చేసిన పోలీసులు.. ఇక పట్టాభిని కస్టడీలోకి తీసుకుని కొత్తగా కనిపెట్టే అంశమేముందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.