బెజవాడ తెలుగుదేశం పార్టీలో రచ్చకెక్కిన గ్రూపు రాజకీయాలు చంద్రబాబు జోక్యంతో చల్లారాయి. కొద్ది రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయనగా టీడీపీ నేతలు ఇవాళ చెలరేగిపోయారు. ఎంపీ కేశినేని నానిపై విజయవాడ నగరానికి చెందిన ముగ్గురు అగ్రనేతలు విమర్శలు గుప్పించారు. కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి విషయంలో రెండు వారాల కిందట వివాదం చెలరేగింది. విజయవాడ టీడీపీకి తానే అధిష్ఠానం అని ఎంపీ కేశినేని నాని ధిక్కారస్వరం వినిపించారు. తన వెనుక ఎవరైనా నడవాల్సిందే కానీ, తాను అవినీతి పరుల వెనుక నడవనంటూ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు విజయవాడ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. తన కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించకపోయినా పరవాలేదని, తనకు నష్టం లేదని, తుడిచిపెట్టుకుపోయేది టీడీపీయేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర టీడీపీకి చంద్రబాబు అధిష్ఠానం అయితే, విజయవాడ టీడీపీకి తానే అధిష్టానం అని ఎంపీ కేశినేని ప్రకటించుకున్నారు. దీనిపై బెజవాడ టీడీపీ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే చంద్రబాబు జోక్యంతో విజయవాడ టీడీపీ నేతలు మెత్తపడ్డారు. చంద్రబాబునాయుడు రాజీనామా చేయమంటే ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేస్తానంటూ కేశినేని దిగివచ్చారు.
బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు
చంద్రబాబు నాయుడును ఏక వచనంతో సంభోదించినప్పుడే ఎంపీ కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినని, కానీ చంద్రబాబుపై తనకు ఉన్న గౌరవంతో వదిలేశానని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇవాళ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ కూడా ఎంపీ కేశినేనిపై విరుచుకుపడ్డారు. పార్టీ కోసం తాము ప్రాణాలు ఫణంగా పెట్టామని, కేశినేని నాని పదవుల కోసం పాకులాడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీపై కేశినేని నాని కులపార్టీ ముద్ర వేస్తున్నాడని, ఇది అందరి పార్టీ అని బోండా ఉమ ఫైర్ అయ్యారు. పార్టీకి తాము కావాలా, ఎంపీ కేశినేని నానీ కావాలో అధినేత చంద్రబాబు నాయుడు తేల్చుకోవాలని బోండా ఉమా ప్రకటించారు. రేపు విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొనబోయే ప్రచారంలో తాను పాల్గొనడం లేదని బోండా ఉమ ముందు ప్రకటించారు. అయితే కాసేపటికే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి అందరితో మాట్లాడి సర్దుబాటు చేశారు. రేపు విజయవాడలో చంద్రబాబు నిర్వహించే ప్రచారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని బోండా ఉమ ప్రకటించారు. విజయవాడ పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జి మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కేశినేని శ్వేతను వెంటబెట్టుకుని బోండా ఉమ ఇంటికి వెళ్లారు. దీంతో అందరూ ఒక్కటయ్యారు. చంద్రబాబు సీరియస్‌గా తీసుకోవడంతో టీడీపీ నేతల మధ్య రచ్చ వ్యవహారం ప్రస్తుతానికి చల్లబడింది.
ఎవరికి వారే యమునా తీరే..
విజయవాడ సిటీ టీడీపీలో అసలేం జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అందరూ కలసి పనిచేయాలని చెప్పిన తరవాత కూడా ముగ్గురు సీనియర్ టీడీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేయడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. టీడీపీ అధిష్టానం కేశినేని నాని కూతురు శ్వేతను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అందరూ కలసి పనిచేయాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు ఆదేశించారు. పది రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న విజయవాడ టీడీపీ నేతలు ఇవాళ ఉన్నట్టుండి మరలా ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. దీని వెనుక ఏం జరిగింది అనేది ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత మేయర్ కావడం ఇష్టం లేకనే బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలు ఎన్నికలకు కేవలం మూడు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు చేశారని తెలుస్తోంది. వారికి ఇష్టం లేకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించిన తరవాత అందరూ కలసి పనిచేసుకోవాల్సి ఉంది. అయితే విజయవాడ టీడీపీలో ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు.
ఎంపీ కేశినేని నాని ఒంటరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయవాడ పశ్చిమలో జలీల్ ఖాన్ సహకారం తీసుకున్నారు. ఇక విజయవాడ తూర్పులో గద్దె రాంమ్మోహన్ వివాద రహితుడు. ఏ వర్గాలను వెనుకేసుకు రాడు. దీంతో ఈ ప్రాంతంలో కూడా కేశినేనికి ఇబ్బంది లేదు. అయితే తమ అనుచరులకు కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పించుకోవడంలో ఆ ముగ్గురు నేతల మాట చెల్లలేదని వారు గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో కేశినేని నానిపై తీవ్ర విమర్శలకు దిగారని తెలుస్తోంది. అధిష్టానం సీరియస్ కావడంతో ఆ ముగ్గురు నేతలు కాస్త తగ్గారు. విజయవాడలో టీడీపీ గెలుపునకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతామని వారు ప్రకటించారు.
టీ కప్పులో తుఫాను
విజయవాడలో టీడీపీ అభ్యర్థులు గెలవడానికి అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. రాజధాని తరలింపు ప్రకటన చేయడం, విజయవాడలో అభివృద్ధి కుంటుపడటం, పన్నుల పెంపు ఇలా అనేక కారణాలతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. దీన్ని అందిపుచ్చుకుంటే టీడీపీ మేయర్ సీటు కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే టీడీపీలో గ్రూపు రాజకీయాలు విజయావకాశాలను దెబ్బకొట్టే ప్రమాదం ఉంది. అందరూ కలసి పనిచేస్తే టీడీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నా….గ్రూపు రాజకీయాలతో విజయవాడ నేతలు రచ్చకెక్కుతున్నారు. ఈ అంశం టీడీపీ అధినేతను కూడా కలవర పెడుతోందని తెలుస్తోంది. అంతా బాగున్నట్టే అనిపించినా ఇలా రోడ్డున పడి తిట్టుకోవడంతో పార్టీ పరువు కూడా పోయినట్టయింది. ఎన్నికలు అతి సమీపంలో ఉండగా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విజయావకాశాలను గండికొట్టేదిగా ఉంది. విజయవాడ టీడీపీ నేతల నోళ్లు మూయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారని తెలుస్తోంది. అందుకే కేశినేని శ్వేత ఆ ముగ్గురు అసమ్మతి నేతలను కలసి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. దీంతో అంతా సర్థుమనిగినట్టు కనిపిస్తోంది. అయితే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయవాడలో టీడీపీ గెలవడానికి ఉన్న అవకాశాలకు నేతల మధ్య పోరు గండికొట్టే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం