ప్రముఖ శ్రీలంక స్టార్ క్రికెటర్, స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ .. ‘800’ పేరుతో కోలీవుడ్ లో సినిమాగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వరల్డ్ క్రికెట్ లో తన అసాధారణ స్పిన్ మాయాజాలంతో నెం.1 బ్యాట్స్ మెన్ కే దడపుట్టించిన మురళీధరన్ టెస్ట్ మ్యాచెస్ లో 800 వికెట్లు తీసి.. రికార్డు సృష్టించాడు. ఆ పెర్సనాలిటీ జీవిత కథతో ఇటీవలే 800 అనే టైటిల్ తో సినిమా ప్రారంభించారు. మురళీధరన్ పాత్రను తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి పోషిస్తున్నాడని.. ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. శ్రీపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను కూడా ఇటీవల విడుదల చేశారు.
అయితే ఈ సినిమా ప్రకటించిన దగ్గరనుంచి తమిళ నాట ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. జాతి వివక్షను పాటించే ప్రభుత్వానికి మద్దుతు పలికే వ్యక్తి జీవిత చరిత్రలో నటించడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీరాజా, రాధిక లాంటి సినీ ప్రముఖులు సైతం విజయ్ సేతుపతి ఆ సినిమాలో నటించడం తప్పని వేలెత్తి చూపించారు. సోషల్ మీడియాలో అభిమానులు విజయ్ సేతుపతిని ఆ సినిమాలో నటించవద్దని హ్యాష్ ట్యాగులతో ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో తన బయోపిక్ లో నటించవద్దని విజయ్ సేతుపతిని కోరుతూ మురళీ ధరన్ లేఖ కూడా రాశాడు. తన బయోపిక్ చాలా మందికి స్ఫూర్తినిస్తుందని అనుకున్నాను కానీ..ఇంతలా వివాదం అవుతుందనుకోలేదని వాపోయాడు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతికి తన వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని కోరుకుంటున్నానని అందుకే విజయ్ సేతుపతిని ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అభ్యర్ధిస్తున్నానని లేఖలో పేర్కొన్నాడు. దానికి విజయ్ సేతుపతి స్పందిస్తూ.. థ్యాంక్యూ గుడ్ బై అని రిప్లై ఇచ్చాడు. దాంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నాడని స్పష్టమవుతోంది.











