తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు గణనాథుని జయజయధ్వానాలతో పందిళ్లు కిటకిటలాడుతున్నాయి. అయితే, ఈ పండగ పూట వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీరు మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబసమేతం పూజా కార్యక్రమాల్లో పాల్గొని సంప్రదాయ వైభవానికి పెద్దపీట వేస్తుంటే.. జగన్ మాత్రం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలతో సరిపెట్టారు.
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ద్వితీయ శ్రేణి నేతలు, కొద్దిమంది క్యాడర్ నామమాత్రంగా గణపతి పూజలు నిర్వహించినా, అధినేత జగన్ మాత్రం ఏ ఒక్క మండపానికీ వెళ్లలేదు, బహిరంగ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌లోనూ చవితి వేడుకలు నిర్వహించిన దాఖలాలు లేవు.
జగన్ ఇలా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించడం వంటి అధికారిక లాంఛనాలకు మించి, పండగలను జనంతో కలిసి జరుపుకున్న దాఖలాలు కరువే. విజయవాడలో గానీ, తాడేపల్లిలో గానీ గణపతి మండపానికి వెళ్లడం, కుటుంబంతో కలిసి హారతి పట్టడం వంటి ఫ్రేమ్‌లు ఆయన పొలిటికల్ కెరీర్లో అరుదు. సీఎం హోదాలో ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో మొక్కుబడిగా పూజల్లో పాల్గొన్నప్పటికీ, అప్పుడు కూడా కుటుంబసమేతంగా కాకుండా కేవలం రాజకీయ అవసరాల కోసం మాత్రమే పరిమితమయ్యారనే వాదన వినిపిస్తోంది. వ్యక్తిగత విశ్వాసాలు వేరైనా, పబ్లిక్ లైఫ్‌లో, ముఖ్యంగా మేజర్ రిలిజియస్ ఫెస్టివల్స్ విషయంలో ఆయన పాటిస్తున్న ఈ డిస్టెన్స్ వైసీపీ క్యాడర్లో కూడా అయోమయానికి దారి తీస్తోంది.
రాజకీయాల్లో లీడర్ వ్యవహారశైలి అనేది ఓటు బ్యాంకును నిర్దేశించే అతిపెద్ద ఫ్యాక్టర్. పండగ పూట చంద్రబాబు ఫ్యామిలీ ఫోటోలు పబ్లిక్‌లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంటే, జగన్ కేవలం డిజిటల్ విషెస్కే పరిమితమవడం ఆయన లోపాలను ఎత్తిచూపుతోంది. జగన్ తీరుతో వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్రమరింత బలపడుతోంది.











