మహా విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎడాపెడా సొమ్ములు ఖర్చు చేసి ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక విలవిలలాడుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన కొద్దిరోజులకే కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి పరిస్థితులు నేడు రేపు సర్దుకుంటాయి అని ఎదురుచూసిన అభ్యర్థులకు నిరాశే ఎదురైంది.
మొత్తం ఎన్నికల ప్రక్రియలో చేయాల్సిన ఖర్చు… లాక్ డౌన్ సమయం లో మంచినీళ్లలా ఖర్చు అయిపోయింది. తమ తమ వార్డు పరిధిలో ఇంటింటికీ వెళ్లి నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్‌లు ఇలా అనేక వస్తువులను పంపిణీ చేయడంలో అభ్యర్థులు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. ప్రత్యర్థి ఖర్చుకు ఏమాత్రం తగ్గకుండా రెండు పూటలా ఈ పంపిణీలో తలమునకలయ్యారు. మరి కొందరు ఓ అడుగు ముందుకేసి నగదు పంపిణీ కూడా చేశారు.
దినసరి కూలీలు, కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని వారందరికీ ఆర్థికపరమైన ఆసరా అందించారు. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థి అంచనాలకు మించి ఖర్చు చేసేసారు. అదిగో పరిస్థితి చక్కబడుతుంది… ఇదిగో ఎన్నికలు.. అంటూ వారాలు వారాలు గడిచాయి కానీ… కరోనా వైరస్ మాత్రం అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో ఓటర్లు, అనుచరులు తమ చేజారిపోకుండా భోజనం ఏర్పాట్లతో పాటు మద్యం కూడా ఏరులై పారింది.
ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఆరు నెలల గడువు తీరి పోవడం… ప్రత్యేక అధికారుల పాలనను కొనసాగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అప్పటికి గానీ అభ్యర్థులకు ఒక క్లారిటీ రాలేదు. ఇప్పట్లో ఎన్నికలు ఇక సాధ్యం కాదు … అన్న భావనకు వచ్చిన తర్వాత పంపిణీ కార్యక్రమానికి క్రమంగా చెక్ పెడుతూ వచ్చారు. కానీ అప్పటికే అభ్యర్థుల జేబులు, ఖజానా ఖాళీ అయ్యాయి.
మహా విశాఖ నగరంలో వివిధ పార్టీలకు చెందిన అనేక మంది అభ్యర్థులు మద్యం వ్యాపారం కీలకం. ప్రభుత్వం వైన్ షాపుల అనుమతులు ప్రైవేటు వ్యక్తుల నుంచి తొలగించి స్వయంగా అవుట్లెట్స్ నిర్వహిస్తుండడంతో ఆ ఆదాయం కూడా గోవిందా అయింది. లాక్‌డౌన్ సమయంలో సుమారు మూడు నెలలపాటు ఒక్కో అభ్యర్థి 20 లక్షల రూపాయల నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేశారు.
ఇప్పుడు రొటేషన్ చేసేందుకు వ్యాపారాలు లేక ఆదాయ మార్గాలు కానరాక అల్లాడుతున్నారు. తీరా ఇంత ఖర్చు చేసినా.. మళ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు అయితే ఖర్చు షరా మామూలే అన్న భయం అభ్యర్థుల్లో కనిపిస్తోంది. మొత్తంగా కరోనా సమయంలో అభ్యర్థులు మాత్రం పేద వర్గాలను మెండుగా ఆదుకున్నారు అనడంలో సందేహం లేదు.