విశాఖలో మెట్రో ప్రాజెక్టు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. మెట్రో ప్రాజెక్టు పనులను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే ఫైనల్ అయిందని చెప్పారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును మొత్తం రూ.11,498 కోట్లతో నిర్మించనున్నారు. మూడు కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర 42 స్టేషన్లు నిర్మించనున్నారు. జనరల్ కన్సల్టెంట్ టెండర్ల కోసం రూ.224 కోట్లు కేటాయించారు..బిడ్‌లు 2025 జూన్ 9న తెరుస్తారు.
స్టీల్‌ప్లాంటు నుంచి కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు ఉంటాయి. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీసు వరకు 5.07 కిలోమీటర్లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరుకు 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు ఉంటాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు.
విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థలో ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానం చేసేందుకు 15 రహదారులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏడు లక్షల టిడ్కో ఇళ్లను ప్రతిపాదించామని..గత ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లయినా పూర్తి చేయలేక పోయిందన్నారు. వాటికి దసరాకల్లా లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. అమృత్ పథకం కింద రూ.834 కోట్ల మేర పనులు జరుగుతున్నాయని చెప్పారు
VMRDA బృహత్తర ప్రణాళిక, విశాఖ-కాకినాడ పెట్రో కెమికల్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్, విలీన మండలాలకు VMRDA మాస్టర్‌ప్లాన్‌పై సమీక్షించారు. అలాగే MIG లేఅవుట్లు, కొత్త లేఅవుట్ల ఏర్పాటు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి నుంచి విజయనగరం జిల్లా భోగాపురానికి విశాఖ జిల్లా మీదుగా సెమీ రింగు రోడ్డు నిర్మాణం వంటి అంశాలపై రివ్యూ చేశారు.











