సినిమా షూటింగుల్లో హీరోలు రిస్క్ చేయడం, గాయపడటం మామూలే. సాధారణంగా ఇలాంటి రిస్కీ షాట్లను డూప్ లతో చేస్తుంటారు. కానీ కొందరు హీరోలు డూప్ లతో చేయడానికి ఇష్టపడరు.
మహానటుడు నందమూరి తారక రామారావు షూటింగులో గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఆయన నట వారసుడు బాలకృష్ణ కూడా షూటింగులో రిస్క్ చేసేవారు. విజయేంద్ర వర్మ షూటింగులో ఆయన కాలి బోన్ కూడా ఫ్రాక్చర్ అయ్యింది. ఇలా ఎందరో హీరోలు షూటింగుల్లో గాయపడిన సందర్భాలు ఉన్నాయి.
హీరో విశాల్ కూడా అలాంటి రిస్కీ సన్నివేశాల్లో డూప్ ల సాయం తీసుకోడు. ఆయన సినిమాల్లో యాక్షన్ మోతాదు ఎక్కువ. యువరక్తం కావడం వల్ల రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడుతుంటాడు. హీరోగా నిలదొక్కుకోడానికి కారణం కూడా అదే. ఆయన తండ్రి రియల్ ఎస్టేట్ లో బాగా సంపాదించినా సినిమాల మీద మోజుతో తమిళ రంగంలో అడుగుపెట్టాడు. వాస్తవానికి వారిది తెలుగు కుటుంబమే. తమిళంలో స్థిరపడ్డ చాలామంది హీరోల మాదిరిగానే అతనికి మాతృభాష తమిళం కాకపోయినా మంచి గుర్తింపు లభించింది. తెలుగులో కూడా అతని సినిమాలకు క్రేజ్ ఉంది.
విశాల్ గాయాల మాటేమిటి?
విశాల్ హీరోగా నటిస్తున్న 31వ సినిమా షూటింగులో విశాల్ కు ప్రమాదం జరిగింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే జరుగుతోంది. డి.బి. శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు. ఇందులో డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగులో ప్రమాదం జరిగి ఆయన వెన్నుకు తీవ్ర గాయమైనట్టు చెబుతున్నారు. క్లైమాక్స్ చిత్రీకరణలో ఫైట్ తీస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. విలన్ పాత్రధారి బాబూరాజ్ తో గొడవపడే సన్నివేశాన్ని నిన్న చిత్రీకరించారు.
దీనికి కొనసాగింపు సన్నివేశాలను ఈరోజు చిత్రీకరిస్తున్నారు. విశాల్ ను విలన్ బాబూరాజ్ బలంగా వెనక్కి నెట్టడంతో విశాల్ వెళ్లి గోడకు గుద్దుకున్నారు. దాంతో వెన్నుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఫిజియో థెరపిస్టును పిలిపించి చికిత్స అందించారు. కొన్ని రోజులు షూటింగ్ చేయకూడదని వైద్యులు సలహా ఇవ్వడంతో షూటింగ్ నిలిపివేసినట్టు తెలిసింది. దీనికి ముందు ‘ఎనిమి’ అనే సినిమాలో విశాల్ నటించారు. ఇది విడుదల కావలసి ఉంది.
‘చక్ర’ తర్వాత విడుదలయ్యేది ‘ఎనిమి’ చిత్రమే. ఈ రెండు సినిమాల తర్వాత విశాల్ కు దర్శకత్వం చేపట్టాలన్న ఆలోచన కూడా ఉంది. విశాల్ కోలుకుని మళ్లీ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందన్నది ఇప్పుడే చెప్పలేం. ఆందోళన చెందాల్సినంతగా గాయపడలేదని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అంతకుముందు కూడా విశాల్ గాయపడ్డారు. హీరోలు రిస్క్ చేసి యాక్షన్ సన్నివేశాల్లో నటించడం వల్ల నిర్మాతలు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ.
ఇప్పుడు విశాల్ చేసేది సొంత సినిమానే కాబట్టి ఫరవాలేదు. ‘కూలీ’ సినిమా షూటింగ్ చేసేటప్పుడు అమితాబ్ తీవ్రంగా గాయపడటంతో ఆ సినిమా షూటింగ్ చాలా కాలం ఆగిపోయింది. బాలకృష్ణ ‘విజయేంద్ర వర్మ’ పరిస్థితి కూడా అంతే. ఎన్టీఆర్ ‘సర్దార్ పాపారాయుడు’ సమయంలో గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. షూటింగ్ లో హీరో గాయపడితే సినిమా హిట్ అనే సెంటిమెంటు కూడా ఉంది. ఏదేమైనా హీరోలు రిస్క్ లు చేయకుండా ఉంటే మంచిది.
Must Read ;- బాలయ్య కోసం అనుకుంటే.. గోపీచంద్ తో సెట్ అయ్యిందా..?











