తెలంగాణలో రాజకీయాలు సాధారణ ఎన్నికల వేళ వేడెక్కుతున్నాయి. మరోవైపు అధికారం కోసం అధికార పార్టీ.. ఇంకోవైపు అధికార పార్టీని సాగనంపేందుకు విపక్ష పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.
తెలంగాణ రాజకీయాలు వ్యూహప్రతివ్యూహాలతో రసవత్తరంగా మారాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం కోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు కేసీఆర్ ను గద్దెదించేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలకు పదును పెట్టింది. ఆట లో అరటి పండు మాదిరిగా బీజేపీ తన గేమ్ ప్లాన్ తాను చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
ఈ నేపధ్యంలో నేతల కండువా మార్పు రాజకీయం తెరపై కొత్త పుంతలు తొక్కుతోంది. అధికార బీఆర్ఎస్ లో టికెట్ దక్కని ఎమ్మెల్యేలు.., సీనియర్ నేతలు.. బీజేపీ.., కాంగ్రెస్ లోకి వెళ్తుంటే.. బీజేపీ లో అలకపాన్పు ఎక్కిన వారు మాత్రం నేరుగా గాంధీ భవన్ తలుపు తడుతున్నారు. ఇప్పటి వరకు పెద్ద తలకాయాలు కండువా మార్చి కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకట స్వామి కాషాయాన్ని వీడి.. హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం తెలంగాణ లో బాగానే వర్కౌట్ అవుతోంది. ఈ నేపధ్యంలోనే వివేక్ ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని కాంగ్రెస్ తీర్ధ పుచ్చుకున్నారు.
కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం వివేక్ విలువను సైతం పక్కన పెట్టి.. ఏకంగా మూడోసారి కండువా మార్చారని ఇప్పటికే సోషల్ మీడియా కోడై కూస్తుంది. 2009 పెద్దపల్లి ఎంపీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వివేక్ దశాబ్ధన్నర కాలంలో మూడు పార్టీలు మారారు. రెండు పార్టీలోకి అయితే ఏకంగా రెండు సార్లు వెళ్లి.. తిరిగి వాటిని వీడి కూడా వచ్చారు.
2013 లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్, ఆ వెంటనే బీఆర్ఎస్ నుంచి 2014లో తిరిగి కాంగ్రెస్ చేశారు వివేక్. 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చూసి ఓడిపోయారు. ఏమైందో ఏమో కానీ.., తిరిగి అక్కడ నుంచి 2016 లో బీఆర్ఎస్ లోకి వచ్చి చేరారు. అక్కడ నామినేట్ పదవులు చేసి.. 2019 లో జరిగిన లోక్ సభలో ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో అక్కడ నుంచి కూడా రెండో సారి బయటకొచ్చి బీజేపీలోకి చేరాడు.
బీజేపీలో వివేక్ నిన్నటి వరకు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో సాధారణ ఎన్నికల్లో కుమారుడి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కండువా మరో సారి కప్పుకున్నారు వివేక్. చెన్నూరు టికెట్ ఆఫర్ చేసినందుకే కాంగ్రెస్ గూటికి చేరుతున్నారని ఇప్పటికే విశ్లేషణలు ఊపందుకున్నాయి. మొత్తంగా రాజకీయాల్లో అవసరాలు.., అవకాశాల కోసం దారులు తొక్కే పాత్రలు ఎక్కువగా తారసపడుతాయన్నది జగమెరిగిన సత్యమేగా…?











