మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హ*త్య కేసులో కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డికి ED బిగ్‌షాక్ ఇచ్చింది. వివేకా హ*త్య కేసు విచారణకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 14న హైదరాబాద్‌లోని ED కార్యాలయంలో విచారణకు రావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది.
వివేకా హ*త్య వెనుక భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ED అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో దాదాపు రూ. 40 కోట్ల మనీ లాండరింగ్ కోణంపై ED ప్రధానంగా ఆరా తీస్తోంది. ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరికి బదిలీ అయ్యాయి అనే అంశాలపై స్పష్టత తెచ్చుకునేందుకు, ఆ లావాదేవీలతో ఉన్న సంబంధాలపై ఎంపీని ప్రశ్నించేందుకు సిద్ధమైంది.
ఈ కేసు విచారణలో భాగంగా ED ఇప్పటికే తీవ్ర దర్యాప్తు జరిపింది. కేసులో నిందితులుగా ఉన్న దస్తగిరి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డిలను ED అధికారులు ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలాలు సేకరించారు. వారి వద్ద నుంచి లభించిన కీలక సమాచారం ఆధారంగానే ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.
ఒకవైపు CBI విచారణ కొనసాగుతుండగానే, ఇప్పుడు ఈడీ కూడా రూ. 40 కోట్ల మనీ లాండరింగ్ కోణంలో విచారణ వేగవంతం చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 14న ఎంపీ అవినాష్ రెడ్డి ఈడీ ముందుకు హాజరైతే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.











