( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఎన్ని రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. పైగా కార్మికులను రెచ్చగొట్టే ధోరణి అవలంబిస్తోంది. పరిశ్రమ బిడ్డింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాబోయే రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కమిటీని నియమించింది. దీంతో కార్మిక సంఘాలు ఉద్యమ తీవ్రతను మరో స్థాయికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చారు. మార్చి 5న రాష్ట్ర బంద్ నిర్వహించాలని అందుకు ప్రజలు, అన్ని వర్గాలు సహకరించాలని కమిటీ సభ్యులు మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ను కలిసి బంద్ విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు.
ర్యాలీల నుంచి బంద్ వరకు..
ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలు, బహిరంగ సభలు, పాదయాత్రలు ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపడుతున్న ఉద్యమం పట్ల కనీస స్పందన లేకపోవడంతో ఇప్పటికే రాస్తారోకోలు నిర్వహించారు. కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇతర పరిశ్రమలలాగే చూస్తోందని, దీనిని సాధించుకునెందుకు ఎంతటి త్యాగాల కైనా సిద్ధమని, పరిశ్రమను ప్రైవేటుపరం చేస్తే అమరుల త్యాగాల కు విలువ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. దీంతో రాస్తారోకోలు బంద్ వంటి కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. మరోవైపు ట్రేడ్ యూనియన్లు కు చెందిన నాయకులు ఈనెల 6వ తేదీ నుంచి వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులంతా ఇక్కడకు వచ్చి ప్రసంగిస్తున్నారు. ఉద్యమానికి తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులు రిలే నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ వైఎస్ఆర్సిపి సుమారు 25 కిలోమీటర్ల మేర పాదయాత్రను రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కూర్మన్నపాలెం జంక్షన్ వరకు నిర్వహించారు.
రిలే దీక్షలకు నెల రోజులు అయిన సందర్భంగా మార్చి 12న జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సభ్యులు తీర్మానించారు. అనంతరం మార్చి 16న గాజువాకలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అంతకు ముందు మార్చి 5న తలపెట్టిన ఆంధ్రప్రదేశ్ బంద్ స్పందన ఆధారంగా తదుపరి ఆందోళనలపై నిర్ణయం తీసుకోనున్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద కాండిల్ వెలిగించి, ప్రభుత్వలకు వ్యతిరేకంగా కార్మికవర్గం, అధికారులు శనివారం నినాదాలు చేశారు.
ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న ఉద్యమం
విశాఖ లో ప్రారంభమైన ఉద్యమానికి మద్దతుగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లోనూ నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఆందోళనలు కొనసాగించాలని పిలుపునిస్తున్నారు. ఆయా జిల్లాల్లోనూ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విశాఖ ఉక్కును అంత సులభంగా చేశారనివ్వబోమని ఇప్పటికే ప్రకటనలు చేశారు.