ఓటమితో నిస్తేజంలో ఉన్న విజయనగరం టీడీపీ శ్రేణులు నూతనుత్తేజంతో ముందుకు సాగుతున్నాయి. ప్రజాసమస్యలను పరిష్కంచాలంటూ వారు చేపడుతున్న ధర్నాలకు మంచి స్పందన వస్తుండటంతో మరింత పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నాయి.
పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుల నియామకంతో..
టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుల నియామకంతో ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకుంటున్నాయి. విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమితులైన కిమిడి నాగార్జున సీనియర్లయిన అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావులను కలిసి వారి ఆశీస్సులతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే తరుణంలో సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గంలో, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోను గెలిచి తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని క్యాడర్లో స్ఫూర్తి కలిగిస్తున్నారు. పార్లమెంట్ అధ్యక్ష పదవిని అలంకరణగా కాకుండా బాధ్యతగా భావిస్తానంటూ ఆయన భరోసా ఇస్తున్నారు. తన వాక్ఫటిమతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పన్నులు పెంచేస్తోందని, ఆదాయ వనరులు సృష్టించకుండా అస్తవ్యస్తంగా పాలన చేస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఉత్తేజితమవుతున్నాయి.
ప్రభుత్వ తీరును ఎండగడుతున్న సంధ్యారాణి
అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షురాలు గుమ్మడి సంధ్యారాణి వైసీపీ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ టీడీపీ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద టీడీపి శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు. వరదల వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అధిక వర్షాలు, వరదలకు వరి, పత్తి, వేరుశెనగ, పొగాకు, మిర్చి, ఉల్లి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు బాగా దెబ్బ తిని రైతులు తీవ్రంగా నష్ట పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. మెుక్కజొన్నను 30 శాతం కొంటామని, 70 శాతం మార్కెట్‌లో అమ్ముకోవాలని అధికారులు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తడిసిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
విజయనగరం జిల్లాలో ఎట్టకేలకు ప్రజా సమస్యలపైన టీడీపీ శ్రేణులు రోడ్డెక్కడం, సభలు నిర్వహించడంతో ఆ పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల నుండి ఆదరణ లభిస్తోంది. దీనిని ఆ పార్టీ నాయకత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందో వేచి చూడాలి.