(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లాకు ఒక్కో మంత్రిని ఇన్‌ఛార్జిగా నియమించింది. ఆ జిల్లాలో ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే ఆయన పెద్ద దిక్కుగా ఉంటారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తోంది. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా, ఇతరత్రా ఎటువంటి సమస్యలకైనా ఆయన పరిష్కారం చూపుతారని ప్రభుత్వం నమ్మకంగా ముందుకు సాగుతోంది. ఆయా జిల్లాల్లో పార్టీ నాయకులు కూడా జిల్లా ఇన్ ఛార్జిలపై భరోసాతో వ్యవహరిస్తారు. జిల్లా ఇన్‌ఛార్జులు వస్తే ఆ ప్రాంతంలోని సమస్యలు కొలిక్కి వస్తాయని ఆశిస్తారు. పార్టీలోనూ, ప్రభుత్వ కార్యకలాపాలలోనూ భేదాభిప్రాయాలు వచ్చినా.. లోటుపాట్లు ఉన్నా వారు పరిష్కరిస్తారులే అన్న దీమాలో ఉంటారు. కానీ.. విజయనగరం జిల్లా ఇన్‌ఛార్జి తీరుతో జిల్లా అధికార పార్టీ నాయకులు, కేడర్ కలవరం చెందుతున్నారు. ఆయన వల్ల ఈ జిల్లాలో పార్టీకీ వచ్చే మైలేజ్ కంటే ఎదురయ్యే డ్యామేజీని తలచుకుని ఆందోళన చెందుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
మంత్రి మౌనంతోనే ..
రామతీర్థంలో అనూహ్య ఘటన జరిగిన మరునాడే విజయనగరం వచ్చిన జిల్లా ఇన్‌ఛార్జి, దేవాదాయ శాఖ మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే స్పందించుంటే .. సమస్య అక్కడితో ముగిసిపోయుండేదని జిల్లా ప్రజలు భావిస్తున్నారు. కానీ.. తనకేమీ పట్టనట్టు మౌనంగా వెనుదిరగడంతో సమస్య జఠిలమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సమస్య రాజుకున్న తరువాత మంత్రి .. తన స్థాయిని మరిచి పూసపాటి వంశీయుడు అశోక్ గజపతిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అగ్గిలో ఆజ్యం పోసినట్టైందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ నేతల గుండెల్లో దడ!
విజయనగరం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలోని రాములోరి విగ్రహం ధ్వంసం ఘటనలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీరే ఇప్పుడు జిల్లాలో పెద్ద చర్చగా మారింది. రామతీర్థం ఘటన జరిగిన తర్వాత రోజు జిల్లాలో సీఎం కార్యక్రమానికి హాజరైన మంత్రి కనీసం సంఘటనా స్థలానికి వెళ్లలేదు. ఆలయ ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజును తొలగించిన తర్వాత మీడియా ముందుకొచ్చిన మంత్రి వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై రచ్చ జరుగుతుండగానే జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి ఎట్టకేలకు రామతీర్థం వెళ్లిన వెల్లంపల్లి తన విమర్శలకు మరింత పదును పెట్టారు. గతంలో కంటే ఇంకా ఎక్కువగా విమర్శలు చేసి జిల్లా వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెట్టించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
వైసీపీ ఆశలపై నీళ్లు ..
అశోక్ గజపతి రాజు టీడీపీలో ఉన్నా.. పూసపాటి గజపతుల వారసుడిగా ఆయనకంటూ జిల్లా ప్రజల్లో గుర్తింపు ఉంది. జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ అశోక్‌పై విమర్శలు చేసినా.. ఆచి తూచీ వ్యవహరిస్తారు. అయితే, వెల్లంపల్లి హద్దులు మీరడంతో వైసీపీ కేడర్ తలలు పట్టుకుంటున్నారని, ఇన్‌ఛార్జి మంత్రిపై ఆగ్రహిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న క్షత్రియ సామాజికవర్గం మంత్రిపై కారాలు, మిరియాలు నూరుతోంది. అశోక్‌ను వ్యక్తిగతంగా విమర్శించే హక్కు వెల్లంపల్లికి ఎక్కడిదని ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో విజయనగరం వైసీపీ శ్రేణులు సైతం లోలోన ఆందోళన చెందుతున్నారు. మంత్రిగా వెల్లంపల్లి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారని ఆరా తీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే ప్రయత్నాల్లో ఉంటే ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి వచ్చి.. తమ ఆశలపై నీళ్లు జల్లేశారని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి ప్లస్ అవుతుందేమో ..
జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో వెల్లంపల్లి ఇక్కడి సమస్యలు పరిష్కరించకపోగా.. కొత్త సమస్యలు తీసుకొస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారని భోగట్టా. అశోక్‌పై సానుభూతి పెరిగి అది ఎక్కడ టీడీపీకి ప్లస్ అవుతుందోనని కలవర పడుతున్నట్టు సమాచారం. మరి.. వైసీపీకి ఉద్ధండులైన నాయకులు ఉన్న ఈ జిల్లాలో రాజకీయాన్ని ఏ విధంగా మార్చి కేడర్‌కు భరోసా ఇస్తారో .. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారిస్తారో వేచి చూడాలి