పరిషత్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామంటూ ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్సీపీ చంకలు గుద్దుకుంటోంది గానీ.. ఎన్నికల పోలింగ్ లో పలువురు ఓటర్లు.. జగన్ సర్కారు పాలనను తూర్పారబడుతూ తమ ఓటరు స్లిప్ తో పాటు ఇతరత్రా స్లిప్ లను బ్యాలెట్ బాక్సుల్లో వైసిన వైనంపై దృష్టి సారిస్తే.. సంబరాలు చప్పున చల్లారిపోవడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. చూడ్డానికి చాలా చిన్న సమస్యలుగానే, సిల్లీ ఇష్యూస్ గానే కనిపిస్తున్నా.. జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై సామాన్యుడు ఏమాత్రం సంతృప్తిగా లేడనే చెప్పాలి. ఇందుకు నిదర్శనంగా పరిషత్ ఓట్ల లెక్కింపులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన చాలా సిల్లీగానే అనిపించినా.. జగన్ సర్కారు నిర్ణయాలు ఏ తరహా ఇబ్బందులను సృష్టించాయోనన్న విషయం ఇట్టే తేలిపోతుంది.
సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ?
ఎన్నికలకు ముందు తాను అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన ఐదేళ్ల పాలన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరతానని కూడా జగన్ చెప్పారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడమ తిప్పిన జగన్.. మద్య నిషేధాన్ని మరిచి.. అబ్కారీ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకునే దిశగా వరుస చర్యలు చేపట్టారు. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నుంచి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వ చేతిలోకి తీసుకొచ్చారు. అప్పటిదాకా ఉన్న మద్యం బ్రాండ్లను ఎత్తిపారేసి.. కొత్త బ్రాండ్లకు ఎంట్రీ ఇప్పించేశారు. చల్లని బీర్లకు తెర దించేశారు. వైన్ షాపులను కుదించేశామని చెబుతూనే.. మద్యం ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచేశారు. వెరసి మందుబాబుల జేబు గుల్ల చేస్తున్నారు.
ఓటరు విజ్ఞప్తి ఏంటంటే..?
జగన్ మార్కు మద్యం పాలసీపై ఇటు విపక్షాలతో పాటు అటు మందుబాబులు కూడా ఓ రేంజిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఆదివారం జరిగిన పరిషత్ ఓట్ల లెక్కింపులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్ల పల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసిన అధికారులకు ఓ ఓటరు స్లిప్ తో పాటు ఓ చీటి కనిపించింది. దానిని తెరచి చూడగా.. జగన్ సర్కారుకు ఓ విజ్ఞప్తి కనిపించింది. అందులో ఏముందంటే.. ‘నల్లచెరువు వైన్ షాప్ లో కూలింగ్ బీర్లు పెట్టాలని కోరుతున్నాము. షాప్ లో మంచి బ్రాండ్లు పెట్టాలి’అని గ్రామానికి చెందిన యువత పేరిట ఓ విజ్ఞప్తి ఉంది. ఇది చూడ్డానికి సిల్లీగానే అనిపించినా.. జగన్ జమానాలో మద్యం షాపుల దుస్థితికి అద్దం పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బాబు సవాల్‌కు జగన్ సిద్ధమా?











