దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతరెడ్డిపై 1118 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 22196 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు తలపడ్డారు. ఇందులో స్వతంత్రులు, చిన్నా చితకా పార్టీల నుంచి నామినేషన్ వేసిన వారు సైతం ఉన్నారు. అయితే బిగ్‌బాస్ ఫేమ్ కత్తి కార్తీక సైతం ఈ ఎన్నికల్లో పోటీచేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
తనను గెలిపించాలంటూ దుబ్బాకలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల పక్షాన తాను ఎన్నికల బరిలో దిగుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలని దుబ్బాక ఎన్నికల్లో ఎంతో హడావుడీ చేశారు. తానే గెలవబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. మొదట స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన కత్తి కార్తీక.. ఆ తరువాత తాను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేస్తూ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
మరీ ఇంత హడావుడీ చేసిన కత్తి కార్తీక పదును దుబ్బాక ఎన్నికల్లో పనిచేయలేదా? లేక కత్తి పదును ఇంతేనా? అన్నట్లుగా ఎన్నికల్లో ఓటర్లు ఆమెకు షాకిచ్చారు. ఒకానొక సమయంలో నోటాతో కత్తి కార్తీక పోటీ పడింది. ఆమెకు కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఆమెకు వచ్చిన ఓట్లు 620 మాత్రమేనని సమాచారం. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కత్తి కార్తీక కనీసం వెయ్యి ఓట్లు కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. అందరి ఇళ్లు తిరిగినప్పటికీ ఓటర్లు ఆమెకు ఇలా భారీ షాక్ ఇచ్చారు.











