వచ్చే సంక్రాంతికి బరిలో నిలిచే సినిమా ఏవి అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం దాగుడుమూతలు సాగుతున్నాయి. బాలయ్య, చిరు సినిమాలు మాత్రం బెర్త్ లు కన్ ఫర్మ్ చేసుకున్నాయి. అసలు వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న సినిమాలు పూర్తి కాకపోవడంతో వాటి స్థానంలోకి కొత్తవి వచ్చి చేరుతున్నాయి. బరిలో నిలవాలన్న పట్టుదలతోనే బాలయ్య వీర సింహారెడ్డి, చిరు వాల్తేరు వీరయ్య శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. నవంబరు నెలాఖరుకల్లా షూటింగ్ పార్ట్ పూర్తి చేసి డిసెంబరులో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనున్నారు. ప్రభాస్ ఆదిపురుష్ కూడా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఆ సినిమా స్థానంలో అఖిల్ ఏజంట్ వచ్చి చేరింది. తెలుగు నాట సినిమాలకు ఎక్కువ బిజినెస్ జరిగేది సంక్రాంతిలోనే.
స్ట్రెయిట్ సినిమాలకే ఛాన్స్
ప్రతిసారీ కొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా వచ్చి సంక్రాంతి బరిలో నిలిచి స్ట్రెయిట్ చిత్రాలకు పోటీనిస్తున్నాయి. ఈసారి ఆ అవకాశం లేదు. స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్లు ఇవ్వాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకుంది. 2019లో ఇదే విషయమై దిల్ రాజు వ్యాఖ్యలు చేశారు. దాన్ని అమలు చేయాలని ఛాంబర్ భావించింది. ఈసారి డబ్బింగ్ సినిమాలను తీసుకుంటే విజయ్ వారసులు, అజిత్ తునువు కూడా బరిలో ఉన్నాయి. అయితే విజయ్ వారసుడు నిర్మాత దిల్ రాజు. పైగా ఆ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ తీస్తున్నారు. కాబట్టి వారసుడు విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక అజిత్ తునివును విడుదల చేయడంలో మాత్రం ఇబ్బంది తప్పదేమో. ప్రతి సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు పోటీ పడుతుంటాయి.
మెగా హీరోల సినిమాలు వాయిదా
నిజానికి ఈ సంక్రాంతికి మెగా హీరోల సినిమాలు విడుదల కావాలి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవలసింది పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్ల సంక్రాంతికి రానట్టే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో వచ్చే సినిమాని కూడా సంక్రాంతికే అన్నారు. కానీ శంకర్ సినిమా అంటే వాయిదాలే. పెద్ద సినిమాలు ఇలా ఒక్కటొక్కటిగా పక్కకి తప్పుకోవడంతో మెగాస్టార్ దూకుడు పెంచి వాల్తేరు వీరయ్యను బరిలోకి తెచ్చారు. వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. ఈ రెండు సినిమాలకూ మైత్రీ మూవీసే నిర్మిస్తోంది. ఈ సంక్రాంతి పుంజులు కూడా ఈ రెండు సినిమాలే అనాలి. అఖిల్ ఏజంట్ ను కూడా బరిలోకి తెచ్చారు. ఇవి కాకుండా వేరే చిన్న సినిమాలు కూడా బరిలోకి రాక తప్పదేమో.