ఏపీ సీఎం చంద్రబాబు విజన్, వాటర్ మేనేజ్మెంట్పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్‌ను టార్గెట్ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌పై ఎల్‌నినో ఎఫెక్ట్ పడకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఆయన మెచ్చుకున్నారు. చంద్రబాబును వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తూ, జల వనరుల వినియోగంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహాలను కేటీఆర్ వివరించారు.
ఎల్‌నినో ఎఫెక్ట్‌ను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం అలసత్వం వహిస్తే..ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ముందుచూపుతో గోదావరి జలాలను పట్టిసీమ పంపుల ద్వారా ఒడిసిపట్టారని గుర్తు చేశారు. పట్టిసీమ దగ్గర కేవలం పంపు మీట నొక్కి ఏకంగా 400 టీఎంసీల గోదావరి నీటిని చంద్రబాబు నాయుడు ఎత్తిపోసుకున్నారు..ఆయన తెలివైనోడు కాబట్టే జల పండుగ చేసుకుంటున్నారంటూ KTR వ్యాఖ్యానించారు. అదేవిధంగా కృష్ణా నది నీటిని సైతం పోతిరెడ్డిపాడు, వెలిగొండ ద్వారా తరలించి ఏపీ వర్షాభావ పరిస్థితులను అధిగమించేలా పక్కాగా ప్లాన్ చేశారని KTR కొనియాడారు.
కృష్ణా నది తెలంగాణలోని జూరాల వద్ద ప్రవేశిస్తే, అక్కడి నుంచి ఏకంగా 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు జిల్లా కుప్పం వరకు కృష్ణా జలాలను తరలించిన ఘనత చంద్రబాబుదేనని KTR కొనియాడారు. దాదాపు 1000 టీఎంసీల నీటిని ఏపీ ప్రయోజనాల కోసం చంద్రబాబు వాడుకుంటున్నారని ప్రశంసించారు. జూరాల నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు కూడా నీటిని చేర్చి ఆంధ్రాను సస్యశ్యామలం చేశారని, చంద్రబాబు జల నిర్వహణ సమర్థతకు ఇది నిదర్శనమన్నారు KTR.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌కు కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. ఏపీ సీఎం ముందుచూపుతో ప్లాన్ చేసుకుంటే..రేవంత్ సర్కార్ ఇక్కడ చేతులెత్తేసిందన్నారు. ఆంధ్రా మోడల్ వాటర్ మేనేజ్మెంట్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు.











