రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అన్ని పార్టీల నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చలు జరిపారు. పార్టీల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మొత్తం 19 పార్టీలను ఆహ్వానించగా, వైసీపీ సహా 6 పార్టీలు గైర్హాజరయ్యాయి. చాలా పార్టీలు నోటిఫికేషన్ రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎన్నికల నిర్వహణకు సన్నద్ధత గురించి తెలుసుకునేందుకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ తో కూడా నిమ్మగడ్డ ఇదేరోజున సమావేశం అయ్యారు.
ఆ భేటీలో.. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎస్ నీలం సాహ్ని తేల్చి చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ నీలం సాహ్ని వివరించినట్లు తెలుస్తోంది.
కొవిడ్ కారణంగా.. ఏయే ప్రభుత్వ శాఖల్లో ఎందరెందరు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారో గణాంకాల సహా ఈసీకి వివరించినట్లు తెలుస్తోంది. పోలీసు శాఖలోనే కొన్ని వేల మంది కరోనా బారిన పడ్డారని ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం.
దీంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ తక్షణం ఎన్నికలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ.. పెట్టలేని పరిస్థితి. ప్రస్తుత సమయంలో ఎన్నికలు వస్తే.. అధికార పార్టీకి పరాభవం తప్పదనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ఎన్నికల కమిషనర్ ప్రయత్నాల్ని వ్యతిరేకిస్తున్నట్లు పుకార్లున్నాయి.