తెలుగు సాహిత్యంలో చలం రచనలకు ప్రత్యేక స్థానం వుంది. ఆయన రచనల్లో ‘మైదానం’ నవల మరింత విశిష్టమైన స్థానాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. స్త్రీ స్వేచ్ఛకి ప్రాధాన్యతనిస్తూ ఆయన కలం నుంచి వెలువడిన నవలలు అప్పట్లో సంచలనాన్ని సృష్టించాయి. కొన్ని వర్గాల వారి నుంచి నిరసన గళాలు వినిపించాయి. అయినా చలం నిర్భయంగా తన పంథాలోనే రచనలను సాగించారు .. తన భావజాలాన్ని నిర్మొహమాటంగా ఆవిష్కరించారు. ‘మైదానం’ నవల చదివితే చలం అప్పట్లో ఎంత సాహసం చేశారనేది అర్థం అవుతుంది. అలాంటి కథ ఇప్పుడు తెరకెక్కుతుండటం విశేషం.
చలం కలం నుంచి జాలువారిన ‘మైదానం’ కథకు దృశ్యరూపాన్ని ఇవ్వాలనే ఆసక్తితో దర్శకుడు వేణు ఉడుగుల రంగంలోకి దిగాడు. ‘మైదానం’ టైటిల్ తోనే సినిమాను నిర్మించడానికి నిర్మాతగాను మారాడు. దర్శకత్వ బాధ్యతను ‘కవి సిద్ధార్థ్’ కి అప్పగించాడు. కొత్త నటీనటులతో ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. ఓ మాదిరి బడ్జెట్ తో .. కమర్షియల్ టచ్ తో ఈ సినిమా రూపొందుతోంది. త్వరలో ఈ సినిమా తెలుగు ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది.
‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఉడుగుల, ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రానా .. సాయిపల్లవి ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన నిర్మాతగా మారి, ‘మైదానం’ నవలను సినిమాగా నిర్మించడానికి పూనుకోవడం విశేషం. తెలుగు సాహిత్యంలో సంచలనాత్మక నవలగా చెప్పుకునే ‘మైదానం’ .. సినిమాగా ఏ స్థాయిలో తన ప్రభావాన్ని చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.











