దేశంలో మినీ సంగ్రామంగా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు నేటితో ముగిశాయి. పశ్చిమబెంగాల్ లో చివరిదైన 8వ విడత ఎన్నికలు గురువారం ముగియడంతో ఈ ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఎన్నికలు ముగిశాయి. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీ తలపడ్డాయి. పశ్చిమ బెంగాల్ : మొత్తం ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 294 స్థానాలు ఉండగా జంగీపూర్, శంషర్‌గంజ్ అసెంబ్లీ స్థానాల్లోని ఇద్దరు అభ్యర్థులు కొవిడ్ తో చనిపోవడంతో మే 16 న ఓటింగ్ జరుగనుంది. మొత్తం 292 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మార్చి 27 న మొదటివిడత, రెండవ దశ ఏప్రిల్ 1 న, మూడవ దశ ఏప్రిల్ 6 న, నాలుగవ దశ ఏప్రిల్ 10 న, ఐదవ దశ ఏప్రిల్ 17 న, ఆరవ దశ ఏప్రిల్ 22 న, ఏవో దశ 26న పూర్తవ్వగా.. ఎనిమిదో దశను 29న గురువారం జరిగాయి. ఇక్కడ అధికార తృణమూల్కాం గ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోరు సాగింది. ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలో టీఎంసీకి 133, బీజేపీకి 143, లెఫ్ట్ కూటమికి 16 సీట్లు వస్తాయని తేల్చగా, టైమ్స్ నౌ సర్వే ప్రకారం బీజేపీ 115, టీఎంసీకి 158, లెఫ్ట్ కి 21 స్తానాలు వస్తాయని తేల్చారు. టీవీ సర్వేలో టీఎంసీకి 152నుంచి162 సీట్లు వస్తాయని, బీజేపీ అనూహ్యంగా పుంజుకుందని 115-125 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ –లెఫ్ట్ కూటమికి 16 26సీట్లు వస్తాయని తేల్చింది. ఇక ABP-సీ ఓటర్ ప్రకారం టీఎంసీ 152-164, బీజేపీకి 109-121, కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు 14-25 వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ మాత్రం బీజేపీకి: రిపబ్లిక్ టీవీ సర్వేలో మాత్రం బీజేపీకి 138 నుంచి 148 స్థానాలు వస్తాయని, తృణమూల్ కాంగ్రెస్‌కు 128 నుంచి 138 స్థానాలు రావొచ్చని పేర్కొంది.
అస్సాం: 126 అసెంబ్లీ స్థానాల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మొదటి దశ ఓటింగ్ మార్చి 27న, రెండో దశ ఏప్రిల్ 1న, మూడో దశ 6న జరిగింది. ఇక్కడ అధికార పార్టీ బీజేపీ, కాంగ్రెస్ + ఎఐయూడీఎఫ్ కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
ఎగ్జిట్ పోల్ విషయానికి వస్తే టైమ్స్ నౌ ప్రకారం బీజేపీ కూటమికి 75-85
సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 40-50 సీట్లు వస్తాయని తేల్చింది. పీపుల్స్ సర్వే ప్రకారం బీజేపీకి కూటమికి 63-68, కాంగ్రెస్ కూటమికి 61-66, ఇతరులు 0-6 స్థానాలు వస్తాయని తేల్చారు. టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం అస్సాంలో మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రానుంది. ఇక్కడ ఎన్టీయే కూటమికి 59-69 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమికి 55-65 సీట్లు వస్తాయని, ఇతరులకు 1-3సీట్లు వస్తాయని తేల్చింది. ఇండియా టుడే ప్రకారం బీజేపీ కూటమికి 75-85, కాంగ్రెస్ కూటమికి 40-50 సీట్లు వస్తాయని అంచనావేసింది.
తమిళనాడు : 232 అసెంబ్లీ స్థానాలకుగాను ఒకే విడతలో ఏప్రిల్ 6 న ఎన్నికలు జరిగాయి. అధికార ఎఐఏడీఎంకె-బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ పార్టీల కూటములు తలపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు 25లోపే సీట్లు దక్కినా.. దేశ వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న రాజకీయాలపై ఆసక్తి నెలకొంది. 50ఏళ్ల చరిత్రలో జయలలిత, ఎం కరుణానిధి లేకుండానే బరిలోకి దిగాగా కమలహాసన్ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్, దినకరన్ అమ్మ మక్కల్ము న్నెట్ర కజగం పార్టీలు బరిలోకి దిగాయి. ఎన్నికలకు ముందు చిన్నమ్మగా పిలిచే శశికళ రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో సమీకరణాలు మారాయి.
ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. టైమ్స్ నౌ ప్రకారం డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 170-180, ఎన్డీయేకు 64-88 సీట్లు వస్తాయని తేల్చారు. టీవీ9 సర్వే ప్రకారం ఇక్కడ కాంగ్రెస్-డీఎంకే కూటమికి అధికారంలోకి వస్తుందని అంచనా. కాంగ్రెస్-డీఎంకే కూటమికి 143-153సీట్లు, బీజేపీ-AIADMK కూటమికి 75-85సీట్లు, ఇతరులకు 2-12 సీట్లు వస్తాయని తేల్చారు. రిపబ్లిక్ టీవీ కూడా డీఎంకేకు 160-170 స్థానాలు వస్తాయని, ఎన్టీయేకు 58-68 స్థానాలు వస్తాయని తేల్చింది.
కేరళ : 140 స్థానాలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. వామపక్షాలతో కూడిన ఎల్‌డిఎఫ్ కూటమి… కాంగ్రెస్ మద్దతు ఉన్న యూడీఎఫ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మెట్రోమేన్ శ్రీధరన్ భారతీయ జనతా పార్టీలో చేరిన నేపథ్యంలో బీజేపీ కూటమి ఎంతమేర ప్రభావం చూపుతుందనేది తేలాల్సి ఉంది. ఎల్డీఎఫ్ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే.. రిపబ్లిక్ టీవీ, సీఎన్ ఎక్స్ సర్వే ప్రకారం ఎల్‌డీఎఫ్ కూటమికి 72 నుంచి 80, యూడీఎఫ్‌కు 58 నుంచి 64 సీట్లు దక్కొచ్చని తేల్చారు. ఎన్డీయేకు కేవలం 1 నుంచి 5 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ పేర్కొంది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఎల్డీఎఫ్ కి 104- 120సీట్లు వస్తాయని తేల్చింది. పుదుచ్చేరి : కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6న పోలింగ్ జరిగింది. బీజేపీ.. కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉండగా వి నారాయణస్వామి ప్రభుత్వం మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమైంది. ప్రభుత్వం కూలిపోయింది. గవర్నర్ పాలన కొనసాగుతోంది. రిపబ్లిక్ టీవీ సర్వే ప్రకారం ఎన్టీయేకు 16-20, యూపీఏకు 11-13 సీట్లు వస్తాయని తేల్చింది. టీవీ9 ఎగ్జిట్ పోల్స్ప్ర కారం చూస్తే 17-19సీట్లు ఎన్డీయే కూటమికి, 11-13సీట్లు కాంగ్రెస్ కూటమికి వస్తాయని తేల్చారు. మొత్తం మీద ఎక్కువ సర్వేలు పశ్చిమబెంగాల్లో టీఎంసీ, కేరళలో ఎల్డీఎఫ్, తమిళనాడులో డీఎంకే, అసోం, పుదుశ్చేరిలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. ఫలితాలు మే2న వెలువడనున్నాయి.
Must Read ;- టీఆర్‌ఎస్‌లో గుర్తుల టెన్షన్.. సాగర్‌లో స్వతంత్రుడికి రోడ్డు రోలర్ కేటాయింపు