‘బాక్సింగ్ డే టెస్టు’.. ప్రస్తుతం ఈ పేరు మారుమోగుతోంది. ఆస్ట్రేలియాతో టీమ్ ఇండియా ‘బాక్సింగ్ డే’ టెస్టు ఆడడమే దీనికి ప్రధాన కారణం. అయితే.. బాక్సింగ్ డే అంటే ఏమిటి? క్రికెట్‌కి, బాక్సింగ్‌కి ఉన్న సంబంధమేంటి? అనే సందేహం అందరినీ వెంటాడుతోంది. వాస్తవానికి ఈ బాక్సింగ్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది. అసలు దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి పిలుస్తున్నారు? భారత్ ఎన్నిసార్లు ‘బాక్సింగ్ డే’ మ్యాచ్ ఆడింది?.. అనే సందేహాలకు నివృత్తే ఈ ప్రత్యేక కథనం…
1950లో తొలిసారిగా..
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మొదటిసారి 1950లో బాక్సింగ్ డే టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత కూడా వివిధ దేశాలతో ఆస్ట్రేలియా, బాక్సింగ్‌డే టెస్టుల్లో ఆడినప్పటికీ.. 1980 నుంచి ప్రతి ఏటా వరుసగా ఈ టెస్టుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
బాక్సింగ్ డే టెస్టులో భారత్..
మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ‘బాక్సింగ్ డే’ టెస్టుల్లో ఆస్ట్రేలియాతో భారత్ 8 సార్లు తలపడింది. ఇందులో 5 మ్యాచ్‌ల్లో కంగారు జట్టు గెలవగా.. 2018లో టీమ్ ఇండియా విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2011 నుంచి మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టుల్లో టీమ్ ఇండియా ఓడిపోలేదు
ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాదు…
‘బాక్సింగ్ డే’ టెస్టు కేవలం ఆస్ట్రేలియాకు మాత్రమే పరిమితం కాలేదు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల్లోనూ ఈ మ్యాచ్‌లను అదే పేరుతో నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య శనివారం నుంచి మొదలైన తొలి టెస్టునూ బాక్సింగ్ డే టెస్టుగానే పిలుస్తున్నారు.
బాక్సింగ్ డే రోజున సంప్రదాయ క్రీడలు
క్రీడల పరంగా బాక్సింగ్ డే ఒక ముఖ్యమైన రోజు. నక్కల వేట కార్యక్రమం కూడా అదే రోజు జరుగుతుంది. ఎర్రటి కోట్లు ధరించి, వేట కుక్కలను తీసుకుని గుర్రాలపై ప్రయాణించే వ్యక్తులు ఈ సంప్రదాయ క్రీడకు చిహ్నంగా కనిపిస్తారు. ఇప్పుడు నక్కల వేటను నిషేధించినా, గుర్రపు స్వారీ, ఫుట్‌బాల్ క్రీడలు కొనసాగుతున్నాయి. చాలా షాపుల్లో ఈ రోజున ఆఫ్టర్ క్రిస్మస్ ఆఫర్లతో అమ్మకాలు సాగిస్తాయి











