ఈ మూడున్నరేళ్లలో తెచ్చిన అప్పులతో ప్రభుత్వం సృష్టించిన ఆస్తులేవి..? నీటి పారుదల ప్రాజెక్టులు ఏవైనా పూర్తిచేశారా..? ప్రాజెక్టుల నిర్మాణాలకెంత ఖర్చు చేశారు..? పేదలకు పక్కా ఇళ్లు ఏమైనా కట్టారా..? ఇళ్ల నిర్మాణానికెంత ఖర్చు పెట్టారు..? మూడున్నరేళ్లలో కట్టిన భవనాలెన్ని..? అంగన్ వాడి, పంచాయితీ బిల్డింగులెన్ని కట్టారు..? కొత్తగా ఏ రోడ్డు అయినా వేశారా..? సీసి రోడ్లు గాని, బిటి రోడ్లు గాని వేశారా..? కనీసం రోడ్లపై గుంతలన్నా పూడ్చారా..? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర పాలకులదే, మరీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డిదే..
సంక్షేమ పథకాలకు వ్యయం వైసిపి ప్రభుత్వమే కొత్తగా చేసింది కాదు. గత ప్రభుత్వాలూ ఖర్చు చేశాయి, మీరూ ఖర్చు చేశారే తప్ప కొత్తగా ఊడబొడించిందేమీ లేదు. గతంలో ఉన్న 39స్కీములు రద్దు చేశారు, అరకొరగా కొన్ని కొత్త స్కీమ్ లు పెట్టారు. సంక్షేమానికి అప్పుడెంత శాతం ఖర్చుచేశారో ఇప్పుడూ అంతే, ఇంకా కోతలే తప్ప అదనంగా పెట్టిందేమీ లేదు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇప్పుడీ మూడున్నరేళ్లలో అడపా దడపా చేసిన పనులేమైనా ఉంటే వాటి బిల్లులూ పెండింగే..మొత్తం పెండింగ్ బిల్లులే రూ లక్షా 80వేల కోట్లు..మంత్రి పెద్దిరెడ్డి, ఇతర వైసిపి నాయకుల కంపెనీలు చేసిన పనులకే తప్ప, మరేవాటికీ చెల్లింపులు లేవు. మీకు వాటాలు లేదా కమిషన్లు ఇస్తేనే బిల్లులు అవుతాయనేది జగద్విదితం.
ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు ఈ 44నెలల్లో ఏనాడైనా ఒకటోతేదీన ఇచ్చి ఎరుగునా..? మళ్లీ నెలవచ్చేదాకా ఈ నెల జీతాలూ, పింఛన్లూ ఇస్తూనే ఉంటారా..? మీ పార్టీ కార్యకర్తలైన గ్రామ వాలంటీర్లకు, సచివాలయ కన్వీనర్లకు మాత్రం ఠంచన్ గా జీతాలు ఇస్తారా..? ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులు వాళ్లపాటి చేయరా..? చివరికి ఉద్యోగుల సిపిఎస్ వాటా రూ 1,300కోట్లు కూడా వాడేసుకుంటారా..? జిపిఎఫ్ నిధులు రూ 413కోట్లు దారిమళ్లించారు. డీఏ బకాయిలు, జిపిఎఫ్, లోన్లు, అడ్వాన్స్ లు, పెన్షన్లు వంటి ప్రయోజనాలన్నీ కలిపి రూ 21వేల కోట్లు పెండింగ్ పెట్టారని ఉద్యోగ సంఘాలే చెప్పాయి.
చంద్రబాబు హయాంలో చేసిన అప్పులతో ఈ ఆస్తులు సృష్టించారని కళ్లెదుటే కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు 70% పనులు అప్పుడే పూర్తిచేస్తే, మీ హయాంలో కనీసం 3%కూడా జరగలేదు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వెలిగొండ, గుండ్లకమ్మ, తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల పనులన్నీ అప్పుడు శరవేగంగా జరిగితే, ఇప్పుడన్నీ పడకేశాయి. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, పురుషోత్తపట్నం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం,పులకుర్తి ప్రాజెక్టు, మారాల ప్రాజెక్టు, పెన్నా అహోబిలం రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్, అడవిపల్లి రిజర్వాయర్, కండలేరు ప్రాజెక్టు, మడకశిర బ్రాంచ్ కెనాల్, సంగం బ్యారేజి, సోమశిల తదితర ప్రాజెక్టుల పనులన్నీ పరుగులెత్తించారు, పూర్తి చేశారు. చంద్రబాబు 5ఏళ్లలో ప్రతి జిల్లాలో రూ 2వేల కోట్ల పైగానే ఖర్చు చేసి జలవనరులను అభివృద్ధి చేశారు. ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులపైనే దాదాపు రూ 70వేల కోట్లు ఖర్చుచేశారు.
పోలవరం ప్రాజెక్టులో 13గంటల్లో 17,929క్యూమీ కాంక్రీటు వేయడం ద్వారా రికార్డు సృష్టించారు. గంటకు 1380కిమీ కాంక్రీటు వేయడం చరిత్ర..24గంటల్లో 35వేల క్యూమీ కాంక్రీటు వేశారు. చంద్రబాబు ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టులపై ఏడాదికి రూ 11,178కోట్లు ఖర్చుచేస్తే, జగన్ ప్రభుత్వం అందులో సగం కూడా పెట్టలేదంటే అతిశయోక్తి కాదు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మూలనపడింది..ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గాలికొదిలేశారు. వెలిగొండ ఎప్పటికి పూర్తి చేస్తారో తెలియదు. వంశధార రెండోదశ, 2వ భాగం పనులు నత్తనడక. హంద్రీ నీవా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేదు. గాలేరు నగరి రెండో దశ ఎప్పటికయ్యేనో..?
గత మూడున్నరేళ్లలో నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా రైతులను పూర్తిగా అప్పుల్లో ముంచేశారు. దేశంలో అత్యధిక రుణభారం ఏపీ రైతులపైనే కావడం గమనార్హం.. ఒక్కో రైతు కుటుంబ తలసరి అప్పు రూ 2,45,554.. జాతీయ స్థాయిలో రూ 74,121 ఉంటే ఏపిలో రైతుపై అంతకంటే 231% అధికమని కేంద్రమంత్రులే చెప్పారు. పండిన ఆహారధాన్యాలలో ఏపి వాటా 3.7% అయితే, అప్పుల్లో ఉన్న రైతు కుటుంబాల్లో ఏపి వాటా 6.3% కావడం గమనార్హం. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ 3వ స్థానంలో ఉంటే ఏపి 6వ స్థానానికి దిగజారింది. అప్పుల్లో మునిగిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా స్పందన శూన్యం. పంటబీమా, రైతురథం, డ్రిప్ సబ్సిడీ, మోడర్నైజేషన్ పథకాలన్నీ నిలిపేయడంతో అన్నదాతల్లో తీవ్ర అశాంతి నెలకొంది.
టిడిపి 5ఏళ్లలో 24,679 కిమీ సిమెంట్ రోడ్లు వేస్తే, వైసిపి వచ్చాక వేసింది శూన్యం. అప్పుడు 5ఏళ్లలో పేదలకు 10లక్షల ఇళ్లు అప్పుడు కడితే, మీరొచ్చాక కట్టిన ఇళ్లెన్ని..? 6,15,809 పంటకుంటలను తవ్వితే మీరొచ్చాక తవ్విన పంటకుంటలెన్ని..? వేలాది అంగన్ వాడి భవనాలు, పంచాయతీ భవనాలను అప్పుడు నిర్మిస్తే ఇప్పుడీ మూడున్నరేళ్లలో నిర్మించినవెన్ని..? ఇన్ ఫ్రాస్ట్రక్షన్ రంగాన్ని చావుదెబ్బ తీశారు. రియల్ ఎస్టేట్ ను కుదేలయ్యేలా చేశారు. ఇసుక మాఫియా ఆగడాలతో లక్షలాది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేలా చేశారు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమయ్యాయి..? కార్పోరేషన్ల ద్వారా తెచ్చిన రూ 1,78,603కోట్లతో ఏం చేశారు..? అవిగాకుండా మీరు తెచ్చిన నాన్ గ్యారంటీ అప్పులు రూ 87,233కోట్లతో ఏం చేశారు..? రైతులకు గాని, పేదలకు గాని, యువతకు, మహిళలకు, కార్మికులకు, బడుగు బలహీనవర్గాల భవిష్యత్తుకు దోహదపడే పని ఒక్కటైనా చేశారా..?
44నెలల్లో రాష్ట్రంలో మీరు సృష్టించిన సంపదేమీ లేకపోగా చంద్రబాబు సృష్టించిన సంపదను ధ్వంసం చేశారు. ప్రజావేదికతో ప్రారంభించి మీరు చేసిన విధ్వంస కాండకు అంతేలేదు. రాజధాని అమరావతిలో రూ 2లక్షల కోట్ల సంపదను సర్వనాశనం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల పనులన్నీ ఆపేసి నిర్మాణ వ్యయాలను పెంచేశారు, సకాలంలో వాటి ఫలితాలు రాకుండా, పొందకుండా చేశారు. చంద్రబాబు కట్టిన ఇళ్లను పేదలకివ్వకుండా వాటిని శిథిలం చేస్తున్నారు. పక్కాఇళ్లు, టిడ్కో ఇళ్లను నాశనం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ గుంతలమయం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మన సమాజానికి రెండు కళ్లు..జగన్ అధికారంలోకి వచ్చాక ఈ రెండు కళ్లను పొడిచేశాడు.. అభివృద్ధిని అడ్డుకున్నాడు. సంక్షేమానికి కోతలు పెట్టాడు. పేదల పొట్టనింపే ‘‘అన్నా కేంటిన్లను’’ మూసేసి వాళ్ల ఉసురు పోసుకున్నాడు. ‘‘ఆదరణ’’ పథకాన్ని రద్దుచేసి బీసీల ఉపాధికి గండికొట్టాడు. నెలకు రూ 3,000 నిరుద్యోగ భృతి నిలిపేసి యువతకు ద్రోహం చేశాడు. విదేశీ విద్య, సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, పండగ కానుకలు, పెళ్లి కానుకలు రద్దు చేశాడు.
పింఛన్ రూ 3వేలకు పెంచుతానని హామీ ఇచ్చి ఏడాదికి రూ 250మాత్రమే పెంచుతూ దగా చేశాడు. వెల్ఫేర్ ‘‘స్కీములనూ, స్కామ్ లుగా’’ మార్చాడు. జగనన్న ఇళ్ళస్థలం పథకంలోనే రూ 14వేల కోట్ల స్కామ్ చేశారు. 104,108 అంబులెన్స్ ల కొనుగోళ్లలో, విద్యాదీవెనలో బూట్లు, బ్యాగుల కొనుగోళ్లలో, చివరికి పిల్లలకిచ్చే చిక్కీలో కూడా స్కామ్ లకు పాల్పడటం హేయం..ఇది చాలదన్నట్లు నన్నే నమ్మండని స్టిక్కర్లు, నాతోనే భవిష్యత్తు అంటూ కార్యక్రమాలు చేపట్టడం సిగ్గుచేటు..అందుకే గడప గడపకూ కార్యక్రమంలో ఎక్కడ చూసినా నిలదీతలే.. రాష్ట్ర విభజన వల్ల వాటిల్లిన నష్టం కన్నా, జగన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల కలిగిన నష్టం అపారం. కోలుకోలేని దెబ్బతీశారు రాష్ట్రాన్ని..తన చేతగానితనం, అసమర్ధత, అవినీతి కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ ను 20ఏళ్లు వెనక్కి నెట్టారు.. ఈ నేపథ్యంలోనే జగన్ పట్ల ప్రజాదరణ రోజురోజుకూ దారుణంగా క్షీణిస్తోంది. సీ ఓటర్ ఇండియా టుడే సర్వేలో 56.5%నుంచి 39.7%కు పతనమైందని వెల్లడైంది కూడా.. ఏడాదిలోనే జగన్ గ్రాప్ భారీగా పడిపోయిందని పేర్కొంది..సొంతరాష్ట్రాల్లో సీఎంలకు ప్రజాదరణలో జగన్ రెడ్డి 10వ స్థానానికి దిగజారారు.