ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోనే లక్షా 30 వేల కోట్లు అప్పులు చేయడంపై మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు, ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కు రాసిన లేఖలు సంచలనంగా మారాయి. ఏపీలో కార్పొరేషన్ల సొమ్ము, సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారని, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు కఠినంగా అమలయ్యేలా చూడాలంటూ ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ నరేష్ కుమార్ కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభుకు లేఖ రాశారు.
ఇతర రుణాల విషయంలో తాకట్టు పెట్టే భూమి విలువ అప్పుకన్నా రెండు రెట్లు ఎక్కువ ఉండేలా చూడాలని నరేష్ కుమార్ లేఖలో విజ్ఙప్తి చేశారు. ఈ రుణాలన్నీ కలిపినా సిబిల్ లిమిట్స్ దాటకుండా చూడాలని సూచించారు. నరేష్ కుమార్ రాసిన లేఖ ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఓట్లు దండుకునేందుకు ఉద్దేశించినవిగా ఉంటున్నాయని, చేతిదాటిపోక ముందే ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని రాజ్యసభ సభ్యుడు సురేష్ ప్రభు, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఏమిటీ ఎఫ్ఆర్బీఎం?
FRBM అంటే పిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్. రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేయకుండా కేంద్రం విధించిన నిబంధన ఎఫ్ఆర్బీఎం. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా జీఎస్డీపీలో 3 శాతం మించి ఏటా రుణాలు చేయడానికి కేంద్రం అనుమతించదు. తాజాగా దీన్ని 3.5 శాతానికి పెంచింది. మరో నాలుగు నిబంధనలు విధించింది. అవన్నీ అమల్లోకి తీసుకువస్తే మరో 1.5 శాతం అంటే మొత్తంగా 5 శాతం దాకా రుణాలు తీసుకోవచ్చన్నమాట.
నాలుగు నిబంధనలు ఇవే..
తాజా నిబంధనల ప్రకారం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 3.5 శాతం రుణాలు తీసుకోవచ్చు. దీనికి అదనంగా మరో 1.5 శాతం తీసుకోవాలంటే కొన్ని సంస్కరణలు తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్ సంస్కరణలు, పట్టణ పురపాలక సంస్కరణలు ఇలా ఈ నాలుగు అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తీసుకువస్తే మరో ఒకటిన్నర శాతం ఎఫ్ఆర్బీఎం లిమిట్ పెరుగుతుంది. అంటే మొత్తంగా ఎఫ్ఆర్బీఎం లిమిట్ 5 శాతానికి పెరుగుతుంది.
అన్ని సంస్కరణలకు ఏపీ సిద్దం
1.5 శాతం ఎఫ్ఆర్బీఎం లిమిట్స్ పెంచుకునేందుకు కేంద్రం సూచించిన నాలుగు సంస్కరణలు చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు అమలు చేస్తోంది. తెలంగాణకు చెందిన 271 మందికి ఏపీలో రేషన్ పంపిణీ చేశారు. దీంతో వన్ నేషన్ వన్ రేషన్ సంస్కరణల అమలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. అంటే రెండవ సంస్కరణ కూడా పూర్తి చేశారన్నమాట. ఇక విద్యుత్ సంస్కరణలు. ఇందులో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటుకు ఏపీ సిద్దమైంది.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పంపుసెట్లకు మోటార్లు బిగించారు. రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్ల వ్యవసాయ విద్యుత్ బిల్లులు కూడా చెల్లించింది. అంటే మూడో సంస్కరణ కూడా ప్రారంభమైందన్న మాట. ఇక నాలుగోది పట్టణ, పురపాలక సంస్కరణలు. ఇందులో భాగంగా ఏటా పట్టణాలు, కార్పొరేషన్లు ap assem15 శాతం గరిష్ఠంగా పన్ను ఆదాయం పెంచుకోవాలి. ఇందుకు అనుమతిస్తూ ఏపీ అసెంబ్లీలో బిల్లు పెట్టారు. మండలిలో ఈ బిల్లు వీగిపోయింది.
ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును కూడా చట్ట రూపంలోకి తేవాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. అంటే నాలుగు సంస్కరణలు అమలు చేస్తే ఏపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం లిమిట్ 5 శాతానికి చేరుతుంది. అంటే ఈ ఏడాది ఏపీ ప్రభుత్వం అదనంగా మరో రూ.30 వేల కోట్లు అప్పుచేసే అవకాశం దక్కుతుంది. వచ్చే ఏడాది నుంచి ఏపీ ప్రభుత్వం ఏటా లక్ష కోట్లు అప్పుచేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించిందని చెప్పవచ్చు.