సినిమా అనేది ఓ మాయా ప్రపంచం. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లుగా మారేది కూడా ఇక్కడే. రాత్రికి రాత్రి జీవితాలు తల్లకిందులైపోతుంటాయి కూడా. ఇలాంటప్పుడు నిర్మాతల్ని, పంపిణీ దారుల్ని ఆదుకోడానికి ముందుకొచ్చే హీరోలు చాలా అరుదు. అసలు ఆదుకోవాల్సిన అవసరం కూడా వారికి ఉండదు. తాము తీసుకున్న కోట్ల పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఆ స్థానంలో ఎవరున్నా అలానే ఆలోచిస్తారు. కానీ కొందరు సూపర్ స్టార్లు మానవత్వంతో స్పందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
కొందరు పారితోషికాన్ని తిరిగి ఇవ్వకపోయినా మరో సినిమా చేస్తానని మాట ఇస్తారు.. చేస్తారు కూడా. ఇది ఎన్నీఆర్, ఏయన్నార్ ల కాలం నుంచీ ఉన్నదే. అయితే పెద్ద మొత్తంలో డబ్బు వెనక్కి ఇచ్చేసిన హీరోలను వేళ్ల మీద లెక్కించవచ్చు. రజనీకాంత్ తన బాబా సినిమా ఫ్లాప్ అయినప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ డబ్బు ఇచ్చే ఏర్పాటుచేశారు. ఇలా ఇవ్వడంపై అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. ఆ కోవలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ‘లాభాలు వస్తే మాకు ఇవ్వరు కదా.. అలాంటప్పుడు నష్టాలు వచ్చినప్పుడు వెనక్కి ఎందుకివ్వాలి?’ అని ఎదురుప్రశ్నించే హీరోలు కూడా ఉన్నారు.
సాధారణంగా ఈ నష్టం అనే మాట ఎక్కువగా నిర్మాత నుంచి కాకుండా డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి వస్తుంది. నిర్మాత ఆ సినిమాని అమ్మేసుకుని లాభాలు వెనకేసుకుని కిమ్మనకుండా కూర్చుంటాడు. ఆ సినిమా కొన్న పాపానికి డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోతారు. అలాంటప్పుడు హీరోలు కలుగజేసుకుని ఎంతో కొంత నష్టాన్ని భర్తీ చేయగలిగితే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థ దెబ్బతినకుండా ఉంటుంది. సినిమా లాభ నష్టాలు.. హీరోల భాగస్వామ్యం అనే అంశంపై నిర్మాత, పంపిణీదారుడు అభిషేక్ నామా ఈమధ్య ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
బాబు బాగా బిజీ, కేశవ, సాక్ష్యం, గూడఛారి వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. నిర్మాతగా ఆయన లాభపడింది కూడా లేదు. పంపిణీదారుడిగా దాదాపు వంద సినిమాలకు పనిచేశారు. ఓ సందర్భంలో హీరో మహేష్ బాబు ప్రస్తావన వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడంటే ఆయన అస్సలు తట్టుకోలేరని, వారిని పిలిపించి మరీ డబ్బులు వెనక్కి ఇప్పిస్తారని చెప్పారు. సినిమా ఆయనతో చేసినా చేయకపోయినా, నిర్మాణ సంస్థతో సంబంధం లేకుండా డబ్బు ఇచ్చేస్తారని చెప్పుకొచ్చారు. నిర్మాత నష్టపోతున్నాడన్నా మహేష్ బాబు చూస్తూ ఊరుకోలేదని చెప్పుకొచ్చారు. వరుడు సినిమాకి ఆయన దాదాపు 80 శాతం నష్టపోయారట.
ఈ విషయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ను కూడా అభిషేక్ నామా పొగిడారు. తను నష్టపోయిన విషయం తెలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా ఇచ్చి నష్టాన్ని భర్తీ అయ్యేలా చేశారని వివరించారు. నష్టపోయి సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్న పంపిణీదారులు చాలామందే ఉన్నారు. నిర్మాతలు, హీరోలు చొరవదీసుకుంటే ఇలాంటి ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించవచ్చు. నష్టపోవడం అనేది నిర్మాతల విషయంలోనూ జరుగుతుంది. అలాంటప్పుడు హీరోలు వెంటనే మరో సినిమా చేసే అవకాశం ఇస్తే వారి తంటాలు వారు పడతారు. పట్టువిడుపులుంటేనే సినిమా ప్రపంచం ముందుకు వెళుతుంది.
Must Read ;- సినిమా టైటిళ్లు దొరికే మాయాబజార్!











