ప్రశాంతతకు నిలయంగా చెప్పుకునే ఆ ప్రాంతం ఒక్కసారిగా భగ్గుమంది. ఎన్నడూ లేని విధంగా రాళ్ళ దాడులు, దహనాలతో రణరంగంగా మారింది. అసలు కోనసీమ అల్లర్లు వెనుక దాగున్న కుట్ర ఏమిటి ? అంబేద్కర్ పేరుతో రాజకీయాల వెనుక ఉద్దేశ్యమేంటి ? సమాజం తగాలబడుతుంటే చలికాచుకుంటున్నది ఎవరు ? ఈ కుట్రలో పోలీసుల భాగస్వామ్యం ఏమిటి ?
పచ్చటి తోరణంలా కనిపించే కోనసీమ ఒక్కసారిగా తగలబడుతోంది. పేరు మార్పు కారు చిచ్చుకు దారితీసింది. దీంతో అల్లర్లకు ఆమడు దూరంలో ఉండే అమలాపురంలో రావణకాష్టం రాజుకుంది. జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ వారం రోజులుగా చేపట్టిన ఆందోళనలు విద్వంశానికి దారి తీశాయి. జేఏసీ చేపట్టిన ర్యాలీతో జిల్లా పేరు మార్పు అంశం ఒక్కసారిగా ప్రళయంగా మారింది. హింసాత్మక ఘటనలకు దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతం అంతా అట్టుడికింది. అయితే అసలు కోనసీమలో కాకరేగడానికి , వివాదానికి కారణాలు ఏమిటి అనే చర్చ జోరందుకుంది.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అమలాపురం కేంద్రంగా ప్రభుత్వం కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసింది. ఇక ఉగాది నుంచి ఈ జిల్లాల్లో వసతులు ఉన్నా లేకున్నా పాలన మాత్రం మొదలయ్యింది. అయితే జిల్లాల ఏర్పాటు సమయంలోనే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలనే డిమాండ్ లు వినిపించాయి. కానీ జగన్ సర్కార్ ఎప్పటిలాగే తాను అనుకున్నదే చేయాలి అనే ధోరణిలో ఆ విజ్ఞప్తులను పక్కకు నెత్తి కోనసీమ జిల్లాగా పేరు ఖరారు చేసింది. కాగా, జిల్లా పేరుపై అన్ని ఆందోళనలూ సద్దుమణిగి ప్రశాంతత నెలకొన్న వేళ.. ఊహించని ప్రభుత్వం రీతిలో తీసుకున్న నిర్ణయం గొడవలకు ఆజ్యం పోసిందట. అమలాపురంలో జరిగిన ముట్టడి రణరంగం కావడానికి జగన్ సర్కారే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి.
వాస్తవానికి జిల్లాల విభజన సమయంలో కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని పార్టీలకు అతీతంగా ఆందోళనలు జరిగినా పట్టించుకోని జగన్ ప్రభుత్వం.. అనూహ్యంగా ప్రభుత్వం చడీచప్పుడు లేకుండా తాజాగా తీసుకున్న నిర్ణయం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఈ నెల 18న కోనసీమ జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అసలు వివాదం రాజుకుంది.జిల్లాకు కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ నిరసనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జిల్లా పేరు మార్చవద్దంటూ జిల్లా కలెక్టరేట్ వెళ్ళి వినతి పత్రం ఇవ్వాలని, భారీ ర్యాలీగా వెళ్లాలని కోనసీమ జిల్లా సాధన సమితి పిలుపునిచ్చింది.
ఈ నేపధ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అమలాపురంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ర్యాలీ జరగకుండా అడ్డుకునేందుకు అమలాపురం అంతటా సెక్షన్ 30, 144 విధించి , సుమారు 500 మంది పోలీసులతో దిగ్బంధనం చేశారు.అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు, ఒక్కసారిగా వేలాదిమంది నిరసనకారులు పోలీసు వలయాన్ని చేధించుకుని వచ్చారు. దీంతో పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేశారు. దొరికిన వారిని దొరికి నట్లు చితక్కొట్టడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకున్నట్లయ్యింది. దీంతో పోలీసులపై నిరసనకారులు రాళ్ళ దాడికి దిగారు.పోలీసు వాహనాలు, బస్సులు తగలబెట్టడంతో అనూహ్యంగా విధ్వంసకాండ చెలరేగింది. అయితే ఈ అంశంలో ప్రభుత్వం తప్పిదం, వైఫల్యం రెండూ ఉన్నాయని, కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్ సర్కార్ ఇటువంటి చర్యలకు పూనుకుండానే అభిప్రాయాలు వ్యక్తంఅవుతున్నాయి.
జిల్లా పేరు మార్చే విషయంలో ప్రభుత్వం రాత్రికి రాత్రి చడీ చప్పుడు లేకుండా అకస్మాత్తుగా నిర్ణయం దేనికి తీసుకుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అమలాపురం మొత్తం పోలీస్ పరాహాలో ఉండగా వేలాదిగా ఆందోళన కారులు ఎలా వచ్చారు, అసలు నిఘా వ్యవస్థ ఏమయ్యింది.. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ప్రభుత్వం సృష్టించిన ఈ వివాదంలో పోలీసుల భాగస్వామ్యం లేకుండానే ఇంత హింసాకాండ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తంఅవుతున్నాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ఎప్పటి మాదిరిగానే ప్రజల దృష్టిని మారాలచే క్రమంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసిందని, అసలు ఈ ఉదంతం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందని.. అయితే దీనిని ప్రతిపక్షాలపైకి నెట్టేసె ప్రయత్నం జరుగుతోందనాయి పరిశీలకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ కోనసీమలో పేరు చిచ్చు కార్చిచ్చుగా మారింది అనైతే చెప్పక తప్పదు.