కథపై గట్టిగా కసరత్తు జరిగి, తనకి సంతృప్తిని ఇచ్చిన తరువాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే హీరో నాని. కథ విషయంలో ఆయన ఎలాంటి పరిస్థితుల్లోను రాజీ పడడని చెప్పుకుంటూ వుంటారు. కథను తెరపై దర్శకుడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు? తన పాత్ర స్వరూప స్వభావాలు ఏమిటి? ప్రేక్షకులకు అది ఎంతవరకూ రీచ్ అవుతుందనే విషయంలో తనకి పూర్తి క్లారిటీ వచ్చిన తరువాతనే సెట్స్ పైకి వెళ్లడం నానీకి అలవాటు. అందువల్లనే ఆయన కెరియర్లో సక్సెస్ రేటు ఎక్కువగా కనిపిస్తుంది. దర్శక నిర్మాతలకు అందుబాటులో వుండే హీరోగా ఆయన పేరు వినిపిస్తుంది.
కొత్తదనం కోసం నానీ ఎప్పటికప్పుడు విభిన్నమైన జోనర్లలో చేస్తుంటాడు. సీరియస్ గా వుండే రోల్ చేసిన తరువాత, కామెడీ పాళ్లు ఎక్కువగా వుండే కథను ఎంపిక చేసుకుంటూ ఉంటాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలను పరిశీలిస్తే, ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ‘వి’ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని చూపించిన నానీ, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే వార్త రీసెంట్ గా బయటికి వచ్చింది. ఈ కథలో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్లనే నానీ ఓకే చెప్పడం జరిగిందని అంటున్నారు.
వివేక్ ఆత్రేయ ఇంతకుముందు తెరకెక్కించిన ‘బ్రోచేవారెవరురా’ భారీ విజయాన్ని సాధించింది. కథనాన్ని వివేక్ ఆత్రేయ నడిపించిన తీరు, ఆ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణమైంది. వివేక్ ఆత్రేయకి స్క్రీన్ ప్లే పై ఎంత పట్టువుందనేది చాటిచెప్పిన సినిమా ఇది. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని రెడీ చేసుకున్నాడట. అందరికీ బాగా తెలిసిన ఒక సామెతను ఈ సినిమాకి టైటిల్ గా పెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నెల 21వ తేదీన టైటిల్ ను ప్రకటించనున్నారు. మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతుండటం విశేషం.