ఊరూ పేరూ లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నారట వెనుకటికెవరో?… సినిమాలు ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోయినా చాలా పేర్లు జనం నోళ్లో తిరుగుతున్నాయి. ఒక బ్యానర్ నుంచి ఒక టైటిల్ రిజిస్టర్ అయితే చాలు దాని మీద చక చకా కథలల్లేయడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఒక సినిమాకి మంచి కథతో పాటు అట్రాక్టివ్ టైటిల్ కూడా చాలా ముఖ్యం. టైటిల్ ను బట్టి కథని ఊహించే నేటి తరం ప్రేక్షకులు.. ఇప్పటి దర్శకులకు సవాల్ గా మారుతున్నారు. అందుకే ఒక టైటిల్ పెట్టే ముందు పలురకాలుగా ఆలోచించి మరీ తమ సినిమాలకు ఖాయం చేస్తున్నారు.
ఫీలర్లు వదిలేదెందుకో?
సినిమాలకు పేర్లు నిర్ణయించే విషయంలో చాలా టైటిల్స్ .. దర్శక నిర్మాతల పరిశీలనలోనే ఉండిపోతున్నాయి. కొన్ని రిజిస్టర్అయినా.. ఖాయం కావడం లేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకోసం పలు టైటిల్స్ ను.. ప్రేక్షకుల రియాక్షన్ కోసం ఫీలర్స్ గా వదులుతున్నారు. కానీ చాలా వరకూ పెండింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి. కొందరు దర్శకులు .. టైటిల్ ఖాయం చేయకుండానే ఆ సినిమాలకు సంబంధించిన టీజర్స్ ను సైతం విడుదల చేసేస్తున్నారు. నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమాకి ఇప్పుడు టైటిల్ పెద్ద సమస్యగా మారింది.
లాక్ డౌన్ కు ముందు లాంచ్ అయిన ఈ సినిమా పలు సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుపుకుంది. ఇటీవల తిరిగి ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టాలి అనే విషయంలో దర్శక నిర్మాతలు కన్ఫ్యూజింగ్ గా ఉన్నారు. ‘మోనార్క్, డేంజర్, టార్చ్ బేరర్, వారియర్ , ఉగ్ర నరసింహా, విధ్వంసం‘ లాంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఇందు లో ఏ టైటిల్ ను ఖాయం చేస్తారో తెలియదు కానీ.. నందమూరి అభిమానులు మాత్రం ఈ విషయంలో కాస్తంత అసహనంగా ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజున టైటిల్ లేకుండానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసి షాకిచ్చాడు దర్శకుడు బోయపాటి.
స్టార్ ఉంటే ఏ పేరైనా ఒక్కటే…
సినిమా పేర్లు ఎలా ఉన్నా స్టార్ ఇమేజ్ ఉంటే ఆ పేరుకే అందమొస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్వకత్వంలో త్వరలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చారిత్రక నేపథ్యంలో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ నిర్మాణం జరుపుకోబోతోంది. రాబిన్ హుడ్ తరహాలోని ఒక బందిపోటు పాత్రను పవన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ రేంజ్ లో ఉండేలా ఈ సినిమాకి ‘విరూపాక్ష’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే .. ఇప్పుడు కొత్తగా ‘ఓం శివమ్’ అనే మరో టైటిల్ కూడా వార్తల్లో నిలుస్తోంది. ఈ రెండింటిలో క్రిష్ ఏ టైటిల్ ఖాయం చేస్తాడో చూడాలి.
ఇక తారక్, త్రివిక్రమ్ కలయిలో త్వరలో తెరకెక్కనున్న సినిమాకి ‘పోయిరావలె హస్తినకు’ అనే వెరైటీ టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ దర్శక, నిర్మాతలు ఈ టైటిల్ ను ఖండించే ప్రయత్నం చేయలేదు. అలాగే.. మరో టైటిల్ ను అనుకుంటున్నట్టు కూడా వార్తలు రాలేదు. సో… అందుకే ఇదే టైటిల్ ను ఖాయం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయినప్పటికీ త్రివిక్రమ్ డెసిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది.
ఇక మహేశ్,త్రివిక్రమ్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న సినిమాకి సైతం ‘సీతారామాపురం’ అనే ఒక వెరైటీ టైటిల్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తోంది. అలాగే.. మెగాస్టార్ చిరంజీవి, వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ వెర్షన్ కు ‘బిగ్ బ్రదర్’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అలాగే.. మరికొందరు స్టార్ హీరోల సినిమాలకూ పలు టైటిల్స్ ప్లానింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. మరి పరిశీలనలో ఉన్న ఈ టైటిల్స్ లో ఎన్ని ఖాయం అవుతాయో చూడాలి.