మాజీ సీఎం జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డి దాదాపు 7 ఏళ్లుగా చేస్తున్న ధర్మ పోరాటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సొంత అన్న జగన్ సహకరించకపోయినా, అధికారంలో ఉన్న నాడు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా బెదిరింపులకు వెరవకుండా సునీత పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఐనవాళ్లే రాక్షసులుగా మారిన రాజ్యంలో..ప్రహ్లాదుడిలా పోరాడుతున్నారు. ప్రహ్లాదుడు ఎలాగైతే ఒంటరిగా ధర్మం, సత్యం వైపే నిలబడ్డాడో.. సునీత కూడా అదే రీతిలో ధర్మయుద్ధం చేస్తున్నారు. తండ్రిని కోల్పోయిన పుట్టెడు దుఃఖంలోనూ హంతకులు ఎంతటి శక్తిమంతులైనా చట్టం ముందు నిలబెట్టాలనే సునీత పట్టుదలకు ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.
కడపలో తిరుగులేని అధికారం, అపారమైన బలం కలిగిన సొంత బంధువులే నిందితుల స్థానంలో ఉన్నారనే ఆరోపణల వేళ సునీత వేసిన ప్రతి అడుగు సంచలనమే. సుప్రీంకోర్టు నుంచి సీబీఐ విచారణ వరకు, కోర్టు బోనుల నుంచి హస్తిన వీధుల వరకు ఆమె ఒక్కరే నిలబడి సాగించిన ఈ సుదీర్ఘ పోరాటం ప్రజాస్వామ్యంలో చరిత్రగా నిలిచిపోతుంది. సొంతవారే ఎదురు తిరిగి తీవ్రమైన మానసిక వేధింపులకు గురిచేసినా ఏనాడూ వెనకడుగు వేయకుండా, తండ్రి చావుకు కారణమైన కుట్ర కోణం బయటకు రావాల్సిందే అంటూ గొంతెత్తడం ఆమెలోని సంకల్పానికి నిదర్శనం.
మరోవైపు, ఇటీవల వివేకా హత్య కేసు విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ హత్య వెనుక ఉన్న భారీ కుట్ర, మనీ ట్రయల్ కోణాలపై సమగ్ర విచారణ జరిపించి తమ కుటుంబానికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని కోరుతూ సునీతారెడ్డి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో పాటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులకు సంచలన లేఖ రాశారు. హత్య వార్త బయటకు రాకముందే మాజీ సీఎం జగన్కు ఎలా తెలిసింది, ఇప్పటివరకు బయటకు రాని ఆయుధం, రూ. కోట్ల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో ED కూడా దర్యాప్తు వేగవంతం చేసి నిందితుల ఆర్థిక మూలాలపై ఆరా తీస్తుండడం కేసులో మరో కీలక మలుపుగా మారింది.
హంతకులు ఎంతటివారైనా తేలే వరకు విశ్రమించేది లేదు అని తెగేసి చెప్తూ రాజీపడని మనస్తత్వంతో ముందుకు సాగుతున్న సునీతారెడ్డి నిజమైన పులివెందుల ప్రహ్లాదుడిగా నిలుస్తున్నారు. ప్రహ్లాదుడి భక్తి, ధర్మం ముందు హిరణ్యకశిపుని రాక్షస రాజ్యం ఏ విధంగానైతే కూలిపోయిందో..ఆ తరహాలోనే ధర్మం ముందర ఏ వ్యవస్థా నిలవలేదనే బలమైన సందేశాన్ని సునీత పంపుతున్నారు.











