చెన్నమనేని విద్యాసాగర రావు.. యవ్వనం నుంచే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త. ఇంట్లో కమ్యూనిస్ట్ భావాలు వెంటాడుతున్నా దానికి విరుద్దంగా హిందూ భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న నాయకుడు. అందుకనుగుణంగానే భారతీయ జనతా పార్టీలో ఆయన కీలక పదవులు పొందారు.
సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా రెండు సార్లు శాసనసభ్యుడిగా విజయం సాధించిన విద్యాసాగర రావు బీజేపీ శాసన సభా పక్ష నేతగా కూడా పని చేశారు. ఇక పార్టీలో సమైక్య రాష్ట్రంలో కీలక పదవులు పొందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగాను పని చేసిన విద్యాసాగర రావు పార్టీ పటిష్టం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఎన్జీవోలపై సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అది దేశవ్యాప్తంగా ఎన్జీవో సంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది.
నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కీలక రాష్ట్రమైన మహరాష్ట్రకు విద్యాసాగర రావును గవర్నర్గా నియమించారు. అయితే, అ పదవి నుంచి తప్పుకున్నాక.. విద్యాసాగర రావు ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ముంబాయిలోని రాజ్ భవన్ ను ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చిన విద్యాసాగర రావు రెండేళ్లుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఈ సమయంలో ఒకటి రెండు సార్లు చుట్టం చూపుగా పార్టీ కార్యాలయానికి వచ్చారే తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది లేదు.
పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ కూడా విద్యాసాగర రావు కనిపించకపోవడం కమలనాధుల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కూడా విద్యాసాగర రావు హాజరుకాలేదు. భారతీయ జనతా పార్టీ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ విద్యాసాగర రావు జాడ లేదు.
గవర్నర్ గా పని చేసిన విద్యాసాగర రావుకు కేంద్ర స్థాయిలో మరో కీలక పదవి ఇస్తారని ఆయన ఆశించారు. అలాగే ఆయన వెంట ఉన్న కార్యకర్తలు కూడా తమ నాయకుడితో పాటు తమకూ కొన్ని పదవులు వస్తాయని ఆశలు పెంచుకున్నారు. అయితే కేంద్ర పెద్దలు మాత్రం విద్యాసాగర రావును పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విద్యాసాగర రావు ఎక్కడా కనిపించకుండా పోయారు.
మహరాష్ట్ర గవర్నర్ గా పని చేసే సమయంలో ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందని ఒక వాదన ఉంది. దీంతో పాటు వెంకయ్య నాయుడుని మంత్రివర్గం నుంచి తప్పించి ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చిన సమయంలో విద్యాసాగర రావు కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని, అదికాస్తా అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం. ఈ కారణాలతోనే విద్యాసాగర రావును పార్టీ పెద్దలు పక్కన పెట్టారని సమాచారం.
దీంతో అలిగిన విద్యాసాగర రావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్న విద్యాసాగర రావును అటు పార్టీ నాయకులు కాని, కార్యకర్తలు కాని కలవడం లేదు. ఆయనను కలిస్తే అధిష్టానానికి ఆగ్రహం వస్తుందనే భయం నాయకుల్లో ఉంది. దీంతో ఒకప్పుడు పార్టీలోను, ప్రభుత్వంలోనూ ఓ వెలుగు వెలిగిన విద్యాసాగర రావు ఇప్పుడు ఊసులో లేకుండా పోయారు.











