కరోనా కారణంగా సినిమాలకి సంబంధించిన సరదాలు.. సందళ్లు కనిపించక చాలా కాలమైంది. కొంతమంది దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నుంచి వదులుతుంటే, మరికొంతమంది థియేటర్స్ లోనే తమ సినిమాలను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. థియేటర్స్ తిరిగి తెరుచుకునే రోజు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ రోజు మరెంతో దూరంలేదనే వార్తలు మాత్రం షికారు చేస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత థియేటర్స్ ను తిరిగి తెరిస్తే, ప్రేక్షకులను పలకరించే సినిమాల్లో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువలన థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయా అనే కుతూహలంతో మెగా అభిమానులు ఉన్నారు.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం అభిమానులను ఎంతగానో ఊరిస్తోంది. హిందీలో భారీ విజయాన్ని నమోదుచేసిన ‘పింక్’ సినిమాకి ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. చాలా గ్యాప్ తరువాత పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి. పవన్ సినిమా థియేటర్స్ కి వస్తుందంటే అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అలాంటి సందడి త్వరలో థియేటర్స్ దగ్గర కనిపించనుంది. హిందీ.. తమిళ భాషల్లో ఈ కథకి విశేషమైన ఆదరణ లభించింది. అందువలన పవన్ కి హిట్ పడటం ఖాయమనే నమ్మకం అభిమానుల మాటల్లో వ్యక్తమవుతోంది.
Also Read:-కళా దర్శకుడు ఆనంద సాయికి పవన్ కల్యాణ్ అభినందనలు
ఇక సాయిధరమ్ తేజ్ నుంచి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమా విడుదలకి సిద్ధమవుతోంది. క్రితం ఏడాది ‘ప్రతిరోజూ పండగే’ వంటి కుటుంబ కథాచిత్రంలో నటించిన సాయిధరమ్ తేజ్, ఈ సారి ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ వస్తుండటం విశేషం. కొత్త దర్శకుడు ‘సుబ్బు’ తెరకెక్కించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. బుచ్చిబాబు దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాతో, కృతిశెట్టి కథానాయికగా నటించింది. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
Also Read:-నేచురల్ స్టార్ మరో భారతీయుడు అవుతాడా?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా కల్యాణ్ దేవ్ కూడా తన స్పీడ్ పెంచుతున్నాడు. ‘విజేత’ సినిమాతో లుక్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కల్యాణ్ దేవ్, ఈ సారి ‘సూపర్ మచ్చి’ సినిమాతో పలకరించనున్నాడు. పులి వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమాపై కల్యాణ్ దేవ్ బలమైన నమ్మకాన్నే పెట్టుకున్నాడు. ఈ సినిమా విడుదలకి సన్నాహాలు జరుగుతూ ఉండగానే, ఆయన తాజా చిత్రంగా ఇటీవలే ‘కిన్నెరసాని’ మొదలైంది. రమణతేజ దర్శకుడిగా రూపొందుతున్న ఈ సినిమా, టైటిల్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఇలా ఒకరి తరువాత ఒకరుగా రంగంలోకి దిగుతున్న మెగా ఫ్యామిలీ హీరోల్లో ఎవరెన్ని రికార్డులను సృష్టిస్తారో చూడాలి మరి.