బాండ్.. జేమ్స్ బాండ్.. ఈ డైలాగ్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలకు కోట్లాది మంది
అభిమానులున్నారు. జేమ్స్ బాండ్ పాత్ర పోషించే నటుడికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. అది జీవితాంతం అలానే కొనసాగుతుంది. బాండ్ ఫ్రాంచైజీకి ఉన్న గొప్పదనం అది. ఇప్పటివరకు ఎంతోమంది నటులు జేమ్స్ బాండ్స్ గా మారారు. తన యాక్షన్ తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డేనియర్ క్రెగ్ జమానా నడుస్తోంది. ఇతడు కూడా జేమ్స్ బాండ్ గా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నాడు. రిస్కీ ఫైట్స్ చేసి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడీ నటుడి కాంట్రాక్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం చేస్తున్న బాండ్ సినిమానే, క్రెగ్ కు బాండ్ గా ఆఖరి చిత్రం. మరి కొత్త జేమ్స్ బాండ్ ఎవరు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రోజుకో కథనం, వారానికో ఊహాగానం షికారు చేస్తోంది.
జేమ్స్ బాండ్ గా క్రెగ్ చివరిసారి కనిపించబోతున్న సినిమా నో టైమ్ టు డై. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈమధ్యే మళ్లీ మొదలైంది. థర్డ్ వేవ్ ప్రభావం లేకపోతే.. సెప్టెంబర్ 30న బ్రిటన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న అమెరికాలో, అదే టైమ్ లో ప్రపంచం మొత్తం ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఈసారి నో టైమ్ టు డై సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే, బాండ్ ఫ్రాంచైజీలో ఇది సిల్వర్ జూబ్లీ సినిమా. అంటే 25వ చిత్రం అన్నమాట. ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించడం నిజంగా క్రెగ్ చేసుకున్న అదృష్టంగానే చెప్పుకోవాలి. సీన్ కానరీ నుంచి పియర్స్ బ్రాస్నన్ వరకు చాలామంది బాండ్స్ గా నటించారు. క్రెగ్ కూడా ఆ లిస్ట్ లో చేరాడు. కానీ బాండ్ 25వ సినిమాలో హీరోగా అతడు చరిత్రలో నిలిచిపోతాడు.
అయితే 26వ సినిమా నుంచి ఎవరు హీరో అనేది ఇప్పుడు టాపిక్. దీనికి సంబంధించి హాలీవుడ్ నుంచి సౌత్ ఏషియా వరకు చాలా పేర్లు వినిపిస్తున్నాయి. అందరూ ముక్తకంఠంతో ఒప్పుకోవాల్సిన అంశం, బాండ్ గా కచ్చితంగా హాలీవుడ్ ఆర్టిస్టే ఉంటాడు. ఈసారి ఈ లిస్ట్ లో టామ్ హార్డీ పేరు గట్టిగా వినిపిస్తోంది. దాదాపు అతడే నెక్ట్స్ బాండ్ అంటూ అంతా ఫిక్స్ అయిపోయారు. ఆ మేరకు బ్రిటిష్ పత్రికలు కూడా కథనాలు వండివార్చేశాయి. కానీ అంతలోనే మరిన్ని కొత్త పేర్లు తెరపైకి రావడం మొదలయ్యాయి.
జేమ్స్ నార్టన్, టామ్ హిడల్ స్టన్ లాంటి హీరోల పేర్లు కూడా తెరపైకొచ్చాయి. వీళ్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఫిట్ నెస్ లో, నటనలో వీళ్లు ఇప్పటికే తమనుతాము ప్రూవ్ చేసుకున్నారు. ఇక టామ్ కు ఉన్న మరో అదనపు అర్హత ఏంటంటే.. అతడు అందగాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి కొత్తగా జీన్ పేజ్ పేరు కూడా చేరింది. 007గా మారే అర్హతలన్నీ ఇతడికి ఉన్నాయి. కాకపోతే వయసు కాస్త ఎక్కువ. నెట్ ఫ్లిక్స్ లో ది గ్రే మేన్ అనే సినిమాలో గూఢచారిగా నటించిన అనుభవం కూడా ఉంది ఇతగాడికి.
అయితే ఇంతకుముందే చెప్పుకున్నట్టు తదుపరి జేమ్స్ బాండ్ 007 ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నో టైమ్ టు డై సినిమా రిలీజయ్యేంతవరకు ఆ మేటర్ ను బయటపెట్టరు మేకర్స్. అంతవరకు ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతూనే ఉంటుంది.











