సీనియర్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీపై అలకబూనారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని ఆయన ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన నియోజక వర్గ సమస్యలను కూడా పట్టించుకోవడం లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి వస్తుందని కాటసాని గట్టిగా ఆశలు పెట్టుకున్నారు. కానీ కర్నూలు జిల్లా నుంచి డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. దీంతో షాక్ కు గురైన ఆయన రెడ్లలో పుట్టడం వల్లే తనకు మంత్రి పదవి రాలేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత జిల్లాలో మంచి పట్టు ఉన్న తనకు దక్కవలసిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాటసాని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు చర్చ జరుగుతోంది.
ఆది నుంచి వైఎస్ఆర్ వెంట నడిచిన తనకు జగన్ మంత్రి పదవి ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాన్ని కాటసాని తన సన్నిహితులతో అన్నట్లు జిల్లా వ్యాప్తంగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టె పలు ప్రశ్నలను ఆయన సంధించారు. గిరిజన భూములు, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకానొక దశలో ఆర్థిక మంత్రి బుగ్గనపై అసెంబ్లీ సాక్షిగా కేటాయింపులు సరిగా లేవంటూ మండిపడ్డారు. అధిష్ఠానం నచ్చచెప్పడంతో కాటసాని సైలెంట్ అయ్యారు. 2021లో జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో కాటసానికి బెర్త్ దక్కకపోతే వైసీపీకి జిల్లాలో తీవ్ర ఇబ్బందులు తప్పవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం నుంచి కాటసాని టీడీపీ హవాలోనూ 1985,1989,1994లోనూ వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బిజ్జం, చల్లా వర్గాలకు వ్యతిరేకంగా నిలిచిన కాటసాని కర్నూలు జిల్లాలో ఆధిపత్యం చెలాయించారు. బిజ్జం సత్యం రెడ్డితో కాటసాని వర్గ ప్యాక్షనిజం అప్పట్లో వార్తలలో నిలిచాయి. సత్యం రెడ్డి మరణం తరువాత ఆయన తనయుడు పార్థసారధి రెడ్డితోనూ కాటసాని తన శత్రుత్వాన్ని కొనసాగించారు. 1999లో జరిగిన ఎన్నికలలో పార్థసారధి రెడ్డి చేతిలో కాటసాని తొలి సారి ఓటమి చవి చూశారు. దీంతో కాటసాని నియోజకవర్గానికి దూరం జరిగారు. వైఎస్ఆర్ సీఎల్పీ లీడర్ గా ఉండటంతో కాటసాని ఆయనను ఆశ్రయించారు.
2004 వైఎస్ఆర్ హవాలో తిరిగి పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన తిరిగి గెలుపొందారు. ఈ దశలో వైఎస్ఆర్ రాజకీయ సమీకరణాలు దృష్ట్యా ‘కాటసాని-బిజ్జం’ వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో బిజ్జం రాజకీయాలకు దూరమయ్యాడు. తిరిగి కాటసాని 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ఆర్ మరణం తరువాత సైలెంట్ గా ఉన్న ఆయన వైసీపీలో చేరలేదు. తొలుత బీజేపీలో చేరిన ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఇండిపెడెంట్ గా 2014 ఎన్నికలలో పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కాటసాని రెండో స్థానంలో నిలబడటం విశేషం.
2019 ఎన్నికల ముందు కాటసాని వైసీపీలో చేరారు. హామీ మేరకు గౌరు చరితా రెడ్డిని కాదని జగన్ ఆయనకు పాణ్యం సీటును కేటాయించారు. దీంతో మనస్తాపానికి చెందిన గౌరు చరితా రెడ్డి టీడీపీలో చేరింది. ఈ ఎన్నికలలో కాటసాని 43 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. వైసీపీలోనే సీనియర్ ఎమ్మెల్యే అయిన తనకు మంత్రి పదవి ఖాయమని ఆయన భావించారు. కానీ సామాజిక సమీకరణాలు దృష్ట్యా కాటసానికి మంత్రి పదవి దక్కలేదు. ఇదే సమయంలో బుగ్గన, గుమ్మనూరు జయరాంలకు జగన్ పెద్ద పీట వేస్తుండటం కాటసాని ఆగ్రహానికి కారణమైంది. జగన్ ఈసారైనా కాటసానికి మంత్రి పదవి ఇస్తాడో లేదో చూడాలన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.