( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
గాజువాకలో ప్రేమోన్మాది చేతిలో బలైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సోమవారం పరామర్శించారు. మంత్రులు ఎప్పుడూ చెప్పే విధంగానే సంఘటనను ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించి సత్వర చర్యలకు ఆదేశించారని సుచరిత చెప్పారు. 7 రోజుల్లో సంఘటనపై దర్యాప్తు చేసి 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా నిందితుని తండ్రి ఇతర కుటుంబ సభ్యులపై కూడా బైండోవర్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ఓదార్పుగా రూ.10 లక్షల రూపాయల చెక్కును జిల్లా కలెక్టరు, గాజువాక శాసన సభ్యుల సమక్షంలో హాం మంత్రి అందజేశారు.
చట్టాలపై అవగాహన లేకనే..
రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వెంటనే ముఖ్యమంత్రి సీరియస్‌గా స్పందించడం స్థానిక అధికారులు కేసులు నమోదు చేయడం, నిందితులను అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ ఒకదాని తరువాత మరొకటి జరిగే ప్రక్రియలే . ఇన్ని నేరాలు జరిగిన తర్వాత అయినా ప్రభుత్వం కాస్త మేల్కొన్నట్టు కనిపిస్తోంది. చట్టాలపై మగ పిల్లలకు, ఆడ పిల్లలకు అవగాహన కలిగించడానికి తగు చర్యలు చేపడతామని మంత్రి ప్రకటించారు. కొత్త కొత్త చట్టాలు చేస్తున్నప్పటికీ వాటిపై నేటి తరానికి సరైన అవగాహన లేకపోవడం, క్షణికావేశంలో, ఉన్మాదంతో వారు చేసే పనుల పర్యవసానం ఎలా ఉంటుందో తెలియక ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. నేరాల నియంత్రణకు కొత్త చట్టాలు చేయడమే కాదు ప్రజల్లో అవగాహన కూడా పెంచాలని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించడం మంచి పరిణామం. అదేవిధంగా ప్రతి విద్యార్థినికి దిశ యాప్ డౌన్ లోడ్ చేయిస్తామని మంత్రి చెప్పారు.
కాగా, చట్టంలోని లొసుగులను వినియోగించుకుని నిందితుడు కొద్ది రోజుల్లోనే బయటకు వస్తాడనే భయంతో వరలక్ష్మి తండ్రి పి. సత్యగురునాథ్ నిందితున్ని బెయిల్‌పై విడిచిపెట్టొద్దని వేడుకున్నాడు. అదేవిధంగా నిందితుడు, అతని కుటుంబ సభ్యుల నుండి తమకు రక్షణ కల్పించాలని కోరారు.