సినిమా థియేటర్ల ప్రారంభం మీద ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇదిగో అదిగో అంటూనే మరో నెల గడిచిపోయింది. ఇప్పటికే కొత్త సినిమాలకు ఓటీటీ మాత్రమే దిక్కుగా కనిపిస్తోంది.
డిసెంబరు నుంచి సినిమా థియేటర్ల ప్రారంభం కానున్నాయట. 50 శాతం సీటుంగులో థియేటర్లు రన్ చేయడం కష్టంతో కూడుకున్న పని అని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇస్తే బాగుంటుందన్నది ఎగ్జిబిటర్ల సూచన. ఇప్పటిదాకా ఆ మినహాయింపుల కోసమే చూస్తున్నారు. నవ్యంధ్రలో మాత్రం ఒకటి రెండు చోట్ల ఐనాక్స్ థియేటర్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాత సినిమాలను అందులో ప్రదర్శించారు. పాత సినిమాలు కాబట్టి జనం నుంచి స్పందన అంతంత మాత్రమే.
కొత్త సినిమాలు ప్రారంభమైతే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుంది. థియేటర్లు ప్రారంభమైతే విడుదల కాబోయే సినిమాలు ఏమిటి? ఏఏ సినిమాలు లైన్లు ఉన్నాయి అని లెక్కలు తీసేవారు కొందరున్నారు.
‘సోలో’గానే వస్తున్న సినిమా సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ డిసెంబరులో విడుదల కాబోతున్నట్లు ఆ సినిమావారి నుంచే అధికారిక ప్రకటన వచ్చేసింది.
అంటే థియేటర్ల ప్రారంభానికి సంబంధించి ఇప్పటికే ఓ నిర్ణయం జరిగిపోయినట్లు తెలుస్తోంది. డిసెంబరు 1 నుంచి ప్రారంభిస్తారా?, క్రిస్మస్ కు ప్రారంభిస్తారా ? అన్న విషయం మీద అయితే క్లారిటీ లేదు. డిసెంబరులో మాత్రం సినిమా థియేటర్లు ప్రారంభమవడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. సినిమాల విడుదలకు ఒక సీజను అంటూ ఉంటుంది. తగిన వసూళ్లు రావాలంటే సంక్రాంతిని బెస్ట్ ఛాయిస్ గా చెబుతుంటారు. అందుకే అందరూ సంక్రాంతికే విడుదల చేయాలని ఉబలాట పడుతుంటారు.
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ముందు థియేటర్లకు రావడానికి జనం అలవాటు పడితేనే గాని వ్యవహారం కొలిక్కి రాదు. థియేటర్లు ప్రారంభం కాగానే విడుదలయ్యే మొదటి సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ అన్నది స్పష్టమైపోయింది. ఇంకా చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ని కూడా డిసెంబరులోనే విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. సాయిధరమ్ తేజ్ డిసెంబరులోనే రావడానికి కారణం జనవరిలో తమ్ముడి సినిమా ఉండటమే.
Must Read ;- సినిమా థియేటర్లను ఇప్పుడు తెరవడం కరెక్టేనా?
అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అందువల్ల తమ్ముడిని జనవరిలో పంపి తను డిసెంబరులో రావాలన్న ఆలోచనతో సాయిధరమ్ తేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ ల సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ని కూడా డిసెంబరులోనే విడుదల చేసే యోచనలో ఉన్నారు. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట పెద్ద హిట్. నాగార్జునకు కూడా డిసెంబరు సెంటిమెంటు ఎక్కువ.
తన ‘వైల్డ్ డాగ్’ను డిసెంబరు చివరలో విడుదల చేయించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. బాలాదిత్య ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ కూడా లైన్ లోనే ఉంది. ఇలా అనేక సినిమాలు డిసెంబరులో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లు ప్రారంభమైతే ఇక ఓటీటీ విడుదలలు తగ్గిపోక తప్పదు. ఇప్పటికే షూటింగులు పూర్తయిన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను చకచకా పూర్తిచేస్తున్నారు. మొత్తానికి డిసెంబరులో మాత్రం సినిమా కళ వచ్చినట్టే కనిపిస్తోంది.











