తమిళనాడులో ఎన్నికలకు ఇక ఏడాది మాత్రమే మిగిలి ఉంది. మరి తలైవా రజనీకాంత్ అడుగుజాడలు ఎలా ఉండబోతున్నాయి? ఆయన పార్టీ పెట్టే విషయం ఏమైంది? పార్టీ పేరేంటి? లాంటి విషయాలపై ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా రజినీ రాజకీయ ప్రవేశంపై వార్తలు వస్తున్నాయి. నవంబరులో ఆయన పార్టీని ప్రారంభించవచ్చన్నది ప్రాథమిక సమాచారం. దీని కోసం మళ్లీ తన అభిమాన సంఘాల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఢిల్లీలో పార్టీ పేరు, గుర్తును రిజిస్టర్ చేయాలంటూ ఆయన లాయర్లు రజినీకాంత్‌కు సూచించారట. డిసెంబరులో ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగనున్నాయి. అందువల్ల నవంబరు నెలలోనే పార్టీని ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎవరు ఎవర్ని శాసిస్తారో?
తమిళ సినీ రంగంలో ఇప్పటిదాకా ఉన్న రజనీ ‘కాంతు’లు ఇకముందు ఎలా ఉంటాయన్నది ఎప్పుడు అందరి ముందూ ఉన్న ప్రశ్న. ఆయన చకచకా సినిమాలు చేయాలనుకున్నారు. కరోనా వచ్చి ఆయన సినిమా షూటింగులకు బ్రేక్ వేసింది. మరో పక్క తమిళనాట ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. గత కొద్ది కాలంగా ఆయన క్రియాశీలక రాజకీయాల గురంచి మాట్లాడుతున్నారు. ఈసారి మాత్రం ఆ మాటమీదే ఆయన నిలబడతారన్నది స్పష్టమవుతోంది. ఈ రాజకీయం ఆయనకు భ్రాంతిగా మిగులుతుందా? సినిమా రంగం మాదిరిగానే ఆయన కాంతులు రాజకీయ రంగంలో కూడా ఉంటాయా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం.
‘సినిమా వారిని తక్కువ అంచనా వేయవద్దు… వారు రాజకీయాలను శాసిస్తారు’ అని ఎప్పడో జార్జ్ బెర్నార్డ్ షా చెప్పిన మాటలు మన మెగాస్టార్ చిరంజీవిని చూసిన తర్వాత పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన రాజకీయాలను శాసించే బదులు ఆయన్నే రాజకీయం శాసించే పరిస్థతి వచ్చింది. తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నకలకు ముందే రజనీ రాజకీయాల వైపు మొగ్గుచూపినా చిరంజీవిని చూసి ఒకింత వెనక్కి తగ్గిన మాట మాత్రం వాస్తవం. అప్పుడు జయ అంటే భయం అనటం కన్నా అపజయం ఎదురైతే ఏమిటనే ప్రశ్న ఆయనను వెనక్కి తగ్గేలా చేసింది.
తానొకటి తలిస్తే…
వాస్తవానికి రజనీ ఇప్పట్లో రాజకీయాల ఊసెత్తి ఉండకూడదు. కానీ ఆయనొకటి తలిస్తే దైవ మొకటి తలిచాడు. అందుకేనేమో… జయలలిత అకాల మరణం సంభవించింది. తమిళనాట రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఓ సినిమాలో దేవుడు శాసించాడు… అరుణాచలం పాటిస్తాడు అని ఆయన డైలాగు చెప్పినట్లుగానే ఇప్పడు దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి వస్తానని ఆయన డైలాగు చెప్పేశాడు. ఆయన రాజకీయం దాదాపు ఖరారైపోయింది. ఇప్పడు ఆయన పరిస్థతి ఒకేఒక్కడు సినిమాలో అర్జున్ పాత్ర మాదిరి ఉంది.
శత్రుసైన్యం ఆయనకు మానసిక ప్రశాంతత లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది. ఆయన తమిళుడు కాదు, పిరికివాడు… రాజకీయాలకు పనికిరాడు.. ఇలా ఎన్నో విమర్శలు చేస్తూ ఆయన విసిగిపోయేలా చేయటానికి శతవిధాలా ప్రయత్నం జరిగింది. రాజకీయాల్లో ఆయన భవిష్యత్తు ఎలా ఉంటుంది? సీఎం అవుతాడా? సొంత పార్టీ పెడతాడా? భారతీయ జనతా పార్టీలో చేరతాడా? అనే ప్రశ్నలకు సమాధానం కూడా తెలుసుకుందాం.
రజనీ శైలి అర్థం ‘కాలా’?
ఆ మధ్య ఓ పక్క అభిమానులతో భేటీ వేసి మళ్లీ ఎంచక్కా ‘కాలా’ షూటింగు చేసుకున్నాడు. ఆ తర్వాత ‘రోబో 2.0’, ‘పేట’, ‘దర్భార్’ సినిమాలు కూడా వచ్చేశాయి. తాజాగా ‘అన్నాత్తే ’ షూటింగులో ఉన్నాడు. కరోనా కారణంగా ఆ సినిమా విడుదల కూడా వాయిదా పడుతుంది. రాజకీయాల విషయానికి వస్తే రజనీ భాజపాలో చేరవచ్చన్నది ఒక ఊహాగానం. ఆ అవకాశమే లేదు. అలా చేస్తే అది కచ్చితంగా తనకు మైనస్సేనని తెలియని అమాయకుడు కాదు రజనీ. ఆయన చేరితే భాజపా అక్కడ బలపడవచ్చేమో కానీ ఆయన మాత్రం బలహీనపడటం ఖాయం. పైపెచ్చు సీం అయ్యే అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి ఆయన సొంత పార్టీ పెట్టడం ఖాయం. కాకపోతే ఆయన వెనుక భాజపా ఉండి తీరుతుందన్న ఓ ఊహాగానం. ఒకవిధంగా ఇది ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం కూడా కావచ్చు.
సినిమాల మాటేమిటి?
రజినీ రాజకీయ పార్టీ పెట్టేటట్లయితే ముందు చకచకా సినిమాలు పూర్తిచేసుకోవలసి ఉంటుంది. అన్నాత్తే కాకుండా మరో రెండు సినిమాలకు కూడా ఆయన అంగీకారం తెలిపారు. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ తెరకెక్కుతోంది. వాసు దర్శకత్వంలో ‘చంద్రముఖి’ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదు. కమల్, రజనీ కలిసి కూడా ఓ సినిమా చేయాలనుకున్నారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశం చేసేటట్లయితే ‘అన్నాత్తే’ సినమానే ఆయన ఆఖరి సినమా అవుతుంది. లేదా రాజకీయ కథాంశంతో ఆయన ఓ సినిమా కూడా చేసేయవచ్చు. సినిమాల పరంగా మాత్రం ఆయన దూకుడు ఎక్కువగానే ఉంది. ప్రజా ‘దర్భారు’లో తీర్పు ఎలా ఉండబోతుందోగాని రజనీ మాత్రం రాజకీయాలనే క్రియాశీలకంగా భావించే అవకాశం ఉంది.
– హేమసుందర్ పామర్తి











