తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్‌రెడ్డి త్వరలోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం, తన కార్యాచరణను మూడు నెలల తరువాత చెబుతానని ప్రకటించడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. ఇక రేవంత్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్లుగా పీసీసీ ప్రసిడెంట్ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. ద్వితీయ శ్రేణి నాయకులు, 17జిల్లాల అధ్యక్షులు రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరగా..కొందరు సీనియర్లు అడ్డుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభిప్రాయ సేకరణ కూడా చేసింది. అయితే చివరి నిమిషంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు అయ్యేవరకు పీసీసీ మార్పు ఆపాలని ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ కుసుమకుమార్‌తో పాటు కొందరు నేతలు కోరారు. దీంతో అధిష్టానం పీసీసీ విషయాన్ని వాయిదా వేసింది.
నాలుగేళ్లుగా వేచి చూసి..
తెలంగాణ తెలుగుదేశం వర్కింగ్ ప్రసిడెంట్‌గా, కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి నాలుగేళ్లైంది. రేవంత్ కాంగ్రెస్‌లో చేరిన కొన్నాళ్ల తరవాత వర్కింగ్ ప్రసిడెంట్‌గా ప్రకటించింది. 2019 లోక్ సభ ఎన్నికల అనంతరం పార్టీలో పీసీసీ మార్పు ఉంటుందని ఆశించారు. అందుకోసం పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుత పీసీసీ ప్రసిడెంట్‌గా ఉత్తమ్ కుమార్ ఆరేళ్లుగా అదే పదవిలో ఉన్నారు. కారణం ఏదైనా 2015 తరువాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతున్నా.. పార్టీ అడ్డుకట్ట వేయలేకపోయింది. ఈ నేపథ్యంలో రేవంత్‌కి పీసీసీ అప్పగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చినా.. అది జరగలేదు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా అంతర్గతంగా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. అంతేకాదు.. తమ మీటింగ్‌లకు వచ్చిన వారిని టార్గెట్ చేసి మరీ తమ పార్టీవారే ఇబ్బంది పెడుతున్నారని రేవంత్ వర్గం కూడా భావిస్తోంది. ఇటీవల రేవంత్ చేపట్టిన పాదయాత్రకు కూడా బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్‌లోని నాయకులు ప్రయత్నించారని విమర్శలూ ఉన్నాయి.
Must Read ;- విక్రమార్కుడిలా ప్రయత్నం.. లక్ష్యానికి దూరం రేవంత్‌రెడ్డి
పార్టీని వీడిన రేవంత్ వర్గీయులు
ఈ పరిస్థితులు ఇలా ఉంటే..కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతలు, రేవంత్ వర్గంగా చెబుతున్నవారు పార్టీని వీడుతున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, సిర్పూర్ కాగజ్‌నగర్ కీలక నేత పాల్వాయి హర్షవర్దన్ తదితరులు పార్టీని వీడగా తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీని సొంతవారే నాశనం చేస్తున్నారనే ఆవేదన ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రేవంత్‌కు పార్టీ అధిష్టానం నుంచి కొన్ని హామీలు వచ్చాయని చెబుతున్నారు. కొందరు కీలక నేతలు కూడా రేవంత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక కర్ణాటకు చెందిన కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ ఇప్పటికే రేవంత్ విషయంలో పార్టీలోని కొందరు కీలకనాయకులతో చర్చించినట్టు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి విషయంలో పార్టీ వైఖరి సరికాదని, అలాంటి లీడర్‌ని పార్టీ వదులుకోకూడదని, అవసరమైతే తానుకూడా ఆలోచించాల్సి వస్తుందనే స్థాయిలో రాహుల్ గాంధీ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం.
తెరపైకి కొత్త పార్టీ..
ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డిలు కలిసి కొత్త పార్టీ పెడతారన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కుటుంబం కూడా విలువలకే ప్రాధాన్యం ఇస్తుంది. కొండా వెంకట రంగారెడ్డి (కేవీ రంగారెడ్డి) మనుమడిగా, అపోలో హాస్పిటల్స్ గ్రూపులో కీలకంగా ఉన్న విశ్వేశ్వర్‌రెడ్డి తొందరపడి నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదని, అందుకే తాను మూడు నెలల తరువాత తన కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారని చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో రాజన్నరాజ్యం తెస్తానని వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పూర్తి ప్రాంతీయ భావం, సామాజిక సమీకరణాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణలోనే త్వరలోనే కొత్త పార్టీ రానుందని ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రేవంత్‌రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వస్తోంది. ఆ ప్రస్తావన మేరకు అనుకూల, ప్రతికూల అంశాలను పరిశీలిస్తే..
అనుకూలతలు..
- ఫైర్ బ్రాండ్ ఇమేజ్
- ఆర్థికంగా బలంగా ఉండడం
- అన్నిసామాజిక వర్గాలను గౌరవించే వ్యక్తిగా పేరు
- టీఆర్ఎస్‌ని ఢీకొట్టగలిగేది రేవంత్ మాత్రమేనన్న అభిప్రాయం
- కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండడం
- కాంగ్రెస్, టీడీపీలోని పలువురు కీలక నాయకులు వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉండడం
- చాలామంది నాయకులు రేవంత్ రెడ్డిని వైఎస్‌లో పోల్చి చూడడం
- ప్రతికూల అంశాలు..
- ఇప్పటికే తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులు పెట్టిన పార్టీలను ప్రజలు ఆదరించకపోవడం
- టీఆర్ఎస్ ఆర్థిక, సామాజిక వ్యూహాలు
- గతంలో బీజేపీ, టీఆర్ఎస్‌లో కొన్నాళ్లపాటు (క్రియాశీలకంగా కాదు) ఉండడం, క్రియాశీలకంగా ఉండి టీడీపీ నుంచి కాంగ్రెస్‌కు మారడం.
- ఇప్పటి వరకు రేవంత్ వెంట ఉన్న టీడీపీ కేడర్ కొత్తపార్టీ పెడితే..ఆవైపు వస్తుందా అనే అనుమానాలు
- ఓవైపు టీఆర్ఎస్‌ని ఎదుర్కొంటూనే.. బీజేపీ, కాంగ్రెస్‌లను ఎదుర్కోవాల్సి రావడం. అదే సమయంలో కేసుల వ్యవహారంలో తలెత్తే ఇబ్బందులు
- రానున్న కాలంలో పొత్తులకు వెళ్లాల్సి వస్తే.. విమర్శించిన పార్టీలతోనే జతకట్టాల్సి వస్తుందన్న చర్చ
- అసలు పార్టీ పెట్టడానికి కారణం ఏంటో ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న చర్చల్లో అంతటి బలమైన కారణం లేకపోవడం.
ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి కార్యాచరణ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రచారంపై అటు రేవంత్‌రెడ్డి కాని, ఇటు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాని ఇంకా స్పందించాల్సి ఉంది.
కౌంటర్ ఇచ్చేందుకూ పార్టీ..
ఇక్కడే మరో విషయం కూడా ఉంది. వీరే కాకుండా.. కాంగ్రెస్‌ను వీడిన వేరే వ్యక్తులు కూడా పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడం ద్వితీయ లక్ష్యం కాగా..కొన్ని పార్టీలకు పడాల్సిన ఓట్లను చీల్చడం ప్రథమ లక్ష్యంగా కొన్నిసార్లు వ్యూహాలను అమలవుతాయి. రేవంత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిలు కాకపోయినా..వేరేవారూ పార్టీ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం లక్ష్యంగా పని చేస్తారా.. లేక పలు అంశాలు, సందేహాలు, అనుమానాలకు తావిస్తున్న షర్మిల పార్టీకి పడే ఓట్లను చీల్చేందుకు పనిచేస్తారా..లేక ఇతర పార్టీ టార్గెట్‌గా పని చేస్తారా అనేది ఆ సందర్భాన్ని బట్టి తేల్చాల్సి ఉంటుంది.
Also Read ;- తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది: జేసీ దివాకర్ రెడ్డి