తెలుగు ప్రజల సహకారంతో ప్రపంచ వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తానని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ. గుంటూరులోని జేకేసీ రోడ్డులో టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఎన్టీఆర్ ఆశయం ఆధారంగా అన్న క్యాంటీన్ లు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు.
ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలనేదే ఎన్టీఆర్ ఆశయమని బాలకృష్ణ పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే గతంలో తెలుగుదేశం పార్టీ హయంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటయ్యాయని ఆయన తెలిపారు.కేవలం రాజకీయ ఉద్దేశంతోనే వైసీపీ సర్కారు అన్న క్యాంటీన్లను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పాలిట శాపాలుగా మారాయని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులు చేసిందన్న బాలయ్య.. దాని ప్రభావమే ప్రజలపై పన్నుల బాదుడే బాదుడు అని విమర్శించారు.