తండ్రి సంపాదిస్తుంటే ఇష్టారాజ్యం కొడుకులు జల్సాలు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. తండ్రి స్వయంకృషితో ఎన్నో కష్టాలు పడి నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కొడుకులు కుప్పకూల్చేస్తుంటే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ చేసిన పని ఇదే. నిప్పు లేకుండా పొగరావడం ఉండదన్నది జగమెరిగిన సత్యం. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని బెయిల్ కూడా రాకుండా ఆర్యన్ ఖాన్ ఊచలు లెక్కిస్తుంటే షారుక్ గుండె తరుక్కుపోతోంది.
ఒకవేళ అతనికి బెయిల్ వచ్చినా పడ్డ మచ్చ మాత్రం చెరిగిపోదు. ఓ పక్క తప్పటడుగులు వేసే హీరోలు ఉన్నారు, ఇంకో పక్క తండ్రి పరువు తీస్తున్న పుత్ర రత్నాలు ఉన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదన్న సమెత మనకు ఉండనే ఉంది. ఆర్యన్ ఖాన్ కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయన్నది ప్రధాన అభియోగం. స్నేహితుడు అర్భాన్ ద్వారా డ్రగ్స్ అతనికి అందేవని, డ్రగ్స్ వాడే అలవాటు కూడా అతనికి ఉందని ఎన్సీబీ దర్యాప్తులో తేలింది. బంతి ముంబయి సెషన్స్ కోర్టుకు చేరింది.
కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఎన్సీబీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. అతని వ్యాట్స్ ప్ అందుకు సాక్ష్యం. దీన్నే కోర్టుకు చూపించారు. ఆర్యన్ కు బెయిల్ సాధించేందుకు అడ్వకేట్ అమిత్ దేశాయ్ తన శక్తియుక్తుల్ని ప్రదర్శించారు. వాదనలు విన్న కోర్టు తన తీర్పును ఈనెల 20 వ తేదీకి వాయిదా వేసింది. అంటే వచ్చే బుధవారం ఆర్యన్ కు బెయిల్ వచ్చేది లేనిది తేలిపోతుంది. ఆర్యన్ కు అంతకుముందు నేర చరిత్ర లేదన్న అంశాన్ని అమిత్ దేశాయ్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆర్యన్ ఖాన్ వయసు 23 ఏళ్లు. ఇంత చిన్న వయసులో వ్యక్తిని స్వేచ్ఛను ప్రసాదించాలని అమిత్ వాదించారు.
ఆర్యన్ కు బెయిల్ వస్తుందా రాదా అన్న ఉత్కంఠ నెలకొని ఉంది. షారుక్ ఖాన్ కు మొత్తం ముగ్గురు సంతానం. వారిలో ఆర్యన్ ఖాన్ పెద్దవాడు. ఆ తర్వాత కుమార్తె, అనంతరం మరో కుమారుడు. స్వయంకృషితో బాలీవుడ్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన షారుక్ ఇప్పుడు కొడుకును ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు ఎవరైనా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే అంత తేలికగా బయట పడలేరు. ప్ర్యతర్థులు కూడా వీరిని కావాలనే కేసుల్లో ఇరికించడం కూడా జరుగుతుంది. వచ్చే బుధవారం ఆర్యన్ కు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాకపోతే ఎన్సీబీ ఈ విషయంలో పట్టుదలతో ఉంది. పూర్తి ఆధారాలతో ఆర్యన్ ను ఈ కేసులో ఇరికించింది.











